వాజేడు, నవంబర్ 23 : ఆరుగాలం శ్రమించి అప్పులు తెచ్చి మరీ మిర్చిని సాగుచేస్తే తెగులు సోకి పంట దెబ్బతింటుండంతో రైతులు దిగులు చెందుతున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు గ్రామపంచాయతీలోని రాంపురం, పేరూరు తదితర గ్రామాల్లో సుమారు 50 ఎకరాలకు పైగా విల్ట్ వైరస్ సోకి పంటలు దెబ్బతిన్నాయి.
ఇప్పటి వరకు ఎకరాకు రూ. లక్షకు పైగా వెచ్చించి సాగుచేస్తే కండ్ల ముందే పనికి రాకుండా పోతున్నదని అన్నదాతలు కన్నీటిపర్యంత మవుతున్నారు. వైరస్‌తో మిర్చి మొక్కలను పీకేవేయాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. తెగులతో పంటలు దెబ్బతిన్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. అధికారులు దెబ్బతిన్న పంటలు పరిశీలించి తమకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించేలా చొరవ చూపాలని వారు కోరుతున్నారు.