హనుమకొండ, నవంబర్ 9 : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం, కార్యకర్తల సహాయ సహకారాలతో ఐదోసారి భారీ మెజార్టీతో గెలుస్తానని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ఐదోసా రి ప్రకటించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. 2009లో ప్రజల ఆశీస్సులతో గెలిచి బీఆర్ఎస్లో చేరి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపు మేరకు రాజీనామా చేసి స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమం చేపట్టామని పేర్కొన్నారు. రైతుల పక్షాన విద్యుత్ సౌధలో ఆందోళన చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలులో పెట్టారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా బయపడకుండా రైల్‌రోకో, సడక్ బంద్, అసెంబ్లీపై నల్లా జెండా ఎగురవేయడం లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోనే పశ్చిమ నియోజకవర్గం ప్రత్యేకమైందని, ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉంటారని చెప్పారు. కరోనా కష్టకాలంలో ప్రజల మధ్యలో ఉంటూ 46వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. తెలంగాన రాక ముందు నగరం ఎట్లా ఉండేది… ఇపుడు ఎట్లా ఉన్నదని ప్రజలు, మేధావులు విశ్లేషించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయంతో నగరాన్ని అభివృద్ధి చేశానన్నారు. గతంలో నియోజకవర్గంలో మూడు, నాలుగు పార్కులు, కాలనీల్లో ఇరుకు, గుంతల రోడ్లు ఉండేవని.. ఇప్పుడు ప్రతి డివిజన్‌కో థీమ్ పార్కు, సీసీ రోడ్లు, జంక్షన్లు అభివృద్ధి చేశామని తెలిపారు.
బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా కోట్లాది రూపాయలు అందించిన ట్లు తెలిపారు. ఉద్యమకారులకూ అండగా నిలిచానన్నారు. నగరాన్ని ఎడ్యుకేషన్, ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చడంతో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించాయన్నారు. కల్చరల్, స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ చార్మినార్, గోల్కొండ కన్నా గొప్ప చరిత్ర ఉన్న హనుమకొండలో జైనులు సంచరించిన అగ్గలయ్య గుట్టను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంటే ఎన్నికల వచ్చినప్పుడే వలస పక్షుల్లా పిచ్చి వేషాలతో వస్తున్న ప్రతిపక్షాలు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డా, నిధులు ఇవ్వకున్నా, కేసీఆర్‌పై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దాడులు చేసినా తట్టుకొని నిలబడ్డామన్నారు. ప్రధాని మోదీ, రేవంత్‌రెడ్డి నిరుద్యోగులను అవహేళన చేయడం దారుణమన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలపై ప్రశ్నిస్తే మోదీ సమాధానం చెప్పలేని దుస్థితిలో ఉన్నారన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని చెప్పారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా వరంగల్ పశ్చిమలో ఎగిరేది గులాబి జెండానేనని స్పష్టం చేశారు. సమావేశంలో రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జన్ను జఖారియా, నార్లగిరి రమేశ్, కపిలవాయి రాంబాబు, నల్ల సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.