హనుమకొండ చౌరస్తా : రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి ( Venkateswar reddy ) విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను విస్మరించి విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేస్తుందని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా 8 వేల కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్( Fee reimbursement ) పెండింగ్‌లో ఉందన్నారు. గతంలో విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్ చేపట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రూ.1200 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని ప్రకటించి మాట తప్పడంతో విద్యాసంస్థలను యాజమాన్యాలు మూసివేశాయని అన్నారు.
ముఖ్యమంత్రికి ఎలక్షన్ల మీద ఉన్న శ్రద్ద విద్యార్థుల భవిష్యత్తు మీద లేకపోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం మంచి పద్ధతి కాదని, అనేకమంది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని విద్యాసంస్థల యాజమాన్యాలను చర్చలకు పిలిచి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు.