హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 23: చారిత్రాత్మక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో హనుమకొండ జిల్లా నూతన కోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.పట్టాభి రామారావు పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు దేవాలయాన్ని సందర్శించారు. వారికి ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఉత్తిష్ట గణపతి దర్శనం కల్పించారు. గర్భాలయంలోని రుద్రేశ్వరస్వామికి పంచామృత అభిషేకాలు నిర్వర్తించి ఆలయ నాట్యమండపంలో తీర్థప్రసాదాలు శేషవస్త్రాలు అందించి వేదఆశీర్వచనం చేశారు.
అనంతరం ఆలయ ప్రశస్తానాన్ని వివరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ చరిత్రలో లిఖించబడిన ఇలాంటి దేవాలయాలు ఎంతో ప్రశస్తమైనదని, కాకతీయులు గత కాలంలోనే ప్రణాళికబద్ధంగా ప్రజల కోసం చెరువులు దేవాలయాలు నిర్మించారని వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వాహణాధికారి అనిల్‌కుమార్, ఆలయ సిబ్బంది మధుకర్, ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేందర్‌శర్మ, మణికంఠశర్మ, సందీప్‌శర్మ పాల్గొన్నారు.