పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 2: చేనేత కార్మిక కుటుంబాలను ఇప్పటికే పలు పథకాలు, ప్రోత్సాహకాలు, సబ్సిడీలతో ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో పథకాన్ని ప్రారంభించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఆర్థికసాయం అందించేందుకు చేనేత మిత్ర పథకాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా చేనేత కార్మికులకు నెలనెలా రూ.3వేలు అందిస్తోంది. ఈమేరకు శుక్రవారం నుంచి వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుండటంతో సంబురాలు చేసుకుంటున్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. వరంగల్ వ్యాప్తంగా వీవర్స్ 1,154 మంది, కార్మికులు 641తో కలిపి మొత్తం 1,795 మంది లబ్ధి చేకూరుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలను నేరుగా ఆదుకోవడానికి అమలు చేస్తున్న చేనేత మిత్ర పథకంపై కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత కార్మికులకు అండగా, జీవనోపాధికి తోడుగా అందజేస్తున్న నగదు సహాయంపై వారు సంబురాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే నేతన్న బీమా, ఆరోగ్య బీమా అమలు చేస్తున్న ప్రభుత్వం నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపడానికి దళారుల ప్రమేయం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో రూ.3 వేలు జమ చేయడం పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో అమలు చేస్తున్న ఈ సహా యం మాకు ఎంతో ఆర్థిక ధీమాగా ఉంటుందని కృతజ్ఞతలు చెబుతున్నారు. ఆగస్టు 7న నిర్వహించిన చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్, చేనేత జౌళిశాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నెలరోజుల్లోపే చేనేత మిత్ర పథకాన్ని అమలులోకి తీసుకవచ్చారు. దీని ప్రకారం ప్రతి మరమగ్గానికి రూ.3వేలు నగదు సాయం అందజేయనుండగా, ఇందులో రూ.2వేలు మగ్గం నేస్తున్న కార్మికులకు, మరో రూ.1000 వారికి తోడుగా పనిచేసే అనుబంధ కార్మికులకు పంపిణీ చేస్తున్నారు. గతంలో నేత ఉత్పత్తులకు అవసరమైన రంగులు, రసాయనాలకు 50 శాతం సబ్సిడీని కార్మికులకు వర్తింపచేసేవారు. ఇందులో నేత సంఘాలకు 5 శాతం వరకు అందజేసేవారు. అయితే ఇందులో కార్మికుడికి చెందాల్సిన ప్రభుత్వ సహాయం అందకుండా పక్కద్రోద పట్టేది. ఇదీకూడా నేరుగా కార్మికులకు చెందకుండా కొంతమంది వ్యక్తులకు వరంగా మారేది. దీంతో నేతన్నలకు ప్రభుత్వం సహాయం అందజేస్తున్నా, వారికి నేరుగా చేరకపోడంతో ప్రభుత్వం నూతన పథకాన్ని అమలు చేస్తుంది. దేశంలో ఎక్కడ కూడా విధంగా ఈ పథకం అమలు చేయడంపై చేనేత కార్మికులు, సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 1795 మంది లబ్ధ్ది..
ప్రభుత్వం ఈ నెల నుంచి అమలు చేస్తున్న చేనేత మిత్ర పథకంలో వరంగల్ జిల్లాలో 1795 మందికి లబ్ధి చేకూరనుంది. దీనిలో 1154 మంది వీవర్స్ ఉండగా, 641 మంది అనుబంధ కార్మికులు ఉన్నా రు. వీరికి శుక్రవారం నుంచి వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవుతున్నాయని చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాఘవరావు తెలిపారు.
మా జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముందు చూపుతో మా జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. నేత వృత్తిపై ఆధారపడ్డ మాకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో అండగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల నుంచి మాకు ఇస్తున్న రూ.3 వేలు మాకు ఎంతో ఆసరాగా నిలుస్తాయి. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని సాహాసమైన నిర్ణయాలు కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటుంది. వారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం.