సుబేదారి,మార్చి28: అత్యంత ప్రమాదకరమైన చెడ్డీగ్యాంగ్ వరంగల్ నగరంలోకి ప్రవేశించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేయూసీ ఫస్ట్ గేట్ ఎదురుగా విద్యారణ్యపురిలో బుధవారం అర్ధరాత్రి జరిగిన చోరీ చేసే క్రమంలో ఆరుగురు ముఠా సభ్యులు చెడ్డీలు, మాస్క్‌లు ధరించి, చేతిలో రాడ్లు, కట్టర్స్ బ్యాగులతో సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పోలీసు అధికారులను అప్రమత్తం చేసి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
సీసీ పుటేజీల ఆధారంగా పోలీసులు అంతర్ రాష్ట్ర చెడ్డి గ్యాంగా.. లేక పార్థివ్ గ్యాంగా? అని అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, లా ఆర్డర్ హనుమకొండ, సుబేదారి, కేయూసీ పోలీసులు టీంలుగా ఏర్పడి నగరాన్ని జల్లెడ పడుతున్నారు. మరోవైపు ముఠా కదలికలు తెలుసు కోవడం కోసం స్థానిక పోలీసులతో నైట్ పెట్రోలింగ్ ముమ్మ రం చేశారు. ప్రధాన జంక్షన్లు, బస్ స్టేషన్లు, రైల్వేస్టేష న్ల్లలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ గ్యాంగ్ మధ్యప్రదేశ్ నుంచి బస్సులో వరంగల్ బస్‌స్టేషన్‌లో దిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిసింది.
అనంతరం ఎక్క డెక్కడ సంచరించారు?, ఎక్కడ షెల్టర్ తీసుకున్నారు? అనే కోణాల్లో పోలీసులు సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. చెడ్డీగ్యాంగ్ నగరంలోకి ప్రవేశించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ గ్యాంగ్ అత్యంత ప్రమాదకరమని, చోరీలు చేస్తున్న సమయంలో ఇంట్లో ఎవరైనా అడ్డువస్తే హత్యలు చేయడానికి వెనుకాడరని ఓ పోలీసు అధికారి చెప్పారు. పదేళ్ల క్రితం జనగామ జిల్లా రఘునాథపల్లిలో రోడ్డు పక్కనే ఉన్న హోటల్లో రాత్రి సమయంలో చెడ్డి గ్యాంగ్ చొరబడి ఇద్దరిని హత్య చేసిన ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది.