కరీమాబాద్, మే 29 : కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తామని, ఇవి రెండు రాచరిక వ్యవస్థ చిహ్నాలని సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి అనడం దేనికి సంకేతమని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రశ్నించా రు. రాష్ట్ర చిహ్నంలో చేస్తున్న మార్పులను నిరసిస్తూ బుధవారం ఖిలావరంగల్‌లో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడు తూ.. కాకతీయులు యావత్ దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారని, కాకతీయులు రాచరిక వ్యవస్థ నుంచి వచ్చిన వారు కాదని, పేదల కోసం పని చేసిన వారని పేర్కొన్నారు. వారు రామప్ప, పాకాల లక్నవరం, ఘన్పూర్, సింగసముద్రం, నల్లగొండలో పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్‌తో పాటు వేలాది చెరువులు, కుంటలు నిర్మించడం వల్లే ఈ రోజు తెలంగాణ రైతాంగం బతికి బట్ట కడుతున్నదన్నారు. తెలంగాణ వచ్చాక పదేళ్లలో ఉద్యమనేత కేసీఆర్ చెరువులు, కుంటలను మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేశారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర చిహ్నంతో పాటు రాష్ట్ర గీతంలో మార్పులు చేయాలని చూస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఆంధ్రోళ్లు తెలంగాణ వ్యవసాయం, యాస, భాషను తుడిచి వేయాలని అనుకున్నారని, చిహ్నం మార్పులపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్పందించాలన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులు రేవంత్‌రెడ్డి వెనక ఉన్నాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సమైక్యవాది కాబట్టే తెలంగాణ చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తున్నారని, ఆయన ఎన్నడూ జై తెలంగాణ అనలేదని, ఉద్యమంలో తుపాకులు పట్టుకుని తిరిగిన చరిత్ర రేవంత్‌రెడ్డిది అని విమర్శించారు.
ఏకపక్షంగా చిహ్నంలోని కాకతీయ తోరణం, చార్మినార్ మారుస్తామని నిర్ణయం తీసుకోవడం, ఇందుకోసం ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ, కమిటీలు, సబ్ కమిటీలు వేయలేదన్నారు. రేవంత్ పాలన అస్తవ్యస్తంగా ఉందని, రాష్ట్ర చిహ్నం మార్పు ఇందుకు నిదర్శనమన్నారు. రేవంత్, చంద్రబాబు గురుశిష్యులని, తెలంగాణ చరిత్ర, ఉద్యమం గురించి మాట్లాడే హక్కు రేవంత్‌రెడ్డికి లేదన్నారు. తప్పుడు హామీలతో కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతో గెలిచారన్నారు. 800 ఏండ్లు పాలించిన కాకతీయ రాజులు బడుగు బలహీనవర్గాలకు చెందిన వారన్నారు. 44 వేలకు పైగా చెరువులను తవ్వించి రాజ్య వైభవం ప్రతిబింబించేలా తోరణం తీర్చిదిద్దారన్నారు. 400 ఏండ్ల క్రితం ప్లేగు వ్యాధితో వేలాది మంది చనిపోతే వైద్యం-సంక్షేమానికి గుర్తుగా చార్మినార్ నిర్మించారన్నారు. రాజరికానికి గుర్తులైతే జాతీయ జెండాలో ఉన్న అశోకచక్రం, 4 సింహాల గుర్తులు సైతం తీసివేస్తారా అని ప్రశ్నించారు. చరిత్రను మార్చే కుట్ర చేయొద్దన్నారు. చట్టప్రకారం రాష్ట్ర చిహ్నం మార్చాలని రేవంత్ కేంద్ర ప్రభుత్వాన్ని కలిస్తే తాము న్యాయ పోరాటం చేస్తామని, హైకోర్టుకు వెళ్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సార య్య, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, మర్రి యాదవరెడ్డి, హరి రమాదేవి, కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ పాల్గొన్నారు.