వరంగల్ చౌరస్తా: కమ్యూనిస్టుల ఐక్యత కోసం పనిచేస్తున్నామని జపం చేస్తూ పనిచేస్తున్న పార్టీని ముక్కలు ముక్కలుగా చేసుకుంటూ ఇతరులపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారు ఎంసిపిఐ (యు) పార్టీని ఎంతో కాలం నిలబెట్టలేరని ఎంసిపిఐ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మోర్తాల చందర్ రావు ,సింగతి సాంబయ్యలు అన్నారు. వరంగల్ వెంకట్రామా జంక్షన్ లోని ఎంసిపిఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న చందర్ రావు మాట్లాడుతూ ఓంకార్, బి.ఎన్.రెడ్డి ల పేర్లు వాడుకోవద్దని చెప్పారు. మీరు నర్సంపేటలో వరంగల్ నగరలలో ఓంకార్ విజ్ఞాన కేంద్రాలు నిర్మిస్తామని, కాంస్య విగ్రహాలు నెలకొల్పుతామని చెప్పి దాతల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి వాడుకున్నారని ఆరోపించారు.
భూపాలపల్లి, ఏటూరు నాగారంలోని లక్షలాది రూపాయల విలువ చేసే పార్టీ ఆస్తులను ఇతరులకు అప్పగించిన మీరు ఓంకార్ బి. ఎన్ రెడ్డి వారసులామని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. నర్సంపేటలో ఓంకార్ గారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పిన పానుగంటి నరసయ్య, మచ్చాపురంలో భారీ స్థూపాన్ని నిర్మించిన చందర్ రావు, హైదరాబాదులో ఓంకార్ భవనం నిర్మించిన సింగతి సాంబయ్యలు ఓంకార్ బి. ఎన్ ల వారసుల అనేది ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
ఇప్పటికైనా వారి విధానాన్ని మానుకోవాలని సూచించారు. సూర్యుడు పై ఉమ్మేయాలనుకోవడం ఎంసిపిఐ నాయకులపై బురద చల్లడం ఒకటే అవుతుందనేది ఎంసిపిఐ (యు) నాయకులు అర్థం చేసుకుంటే మంచిదని సాంబయ్య హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ నాయకులు జన్ను ప్రభాకర్, సింగిరెడ్డి సాంబయ్య, భాషిపాక రమేష్ ,బల్చుకూరి నరసయ్య, బిట్లసమ్మయ్య, అరుణ్, రాకేష్, రాజమౌళి, నాగయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.