హనుమకొండ సబర్బన్, ఏప్రిల్ 2 : జాతీయ రహదారుల విస్తరణపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడడం లేదు. నిధులు మంజూరై, టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభించడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఇందుకు వరంగల్ నుంచి కరీంనగర్ మీదుగా జగిత్యాల వరకు ఎన్‌హెచ్- 563 (NH 563) నాలుగు లేన్ల విస్తరణ చేపట్టకపోవడమే నిదర్శనం. అదేవిధంగా హైదరాబాద్- భూపాలపట్నం నేషనల్ హైవే-163 పనుల్లో సైతం సరైన ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. జంక్షన్లు లేకుండానే విస్తరిస్తున్నారని పలువురు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు రాష్ట్ర పరిధిలోని రోడ్లను తెలంగాణ ప్రభుత్వం రూ.వందల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకుల నిర్లక్ష్యానికి గురైన రోడ్లు ఇప్పుడు అద్దంలా మెరుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో విస్తరించాల్సిన జాతీయ రహదారుల విషయంపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రాలు, ప్రముఖ ఆలయాలు, వాణిజ్య ప్రాధాన్యం ఉన్న ప్రముఖ రోడ్లకు జాతీయ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను కేంద్రం బుట్టదాఖలు చేస్తోంది. మరో వైపు టెండర్లు పూర్తయి ఏండ్లు గడుస్తున్నా పనుల ప్రారంభంలో నిర్లక్ష్యం కనబరుస్తోంది. వరంగల్ నుంచి కరీంనగర్ మీదుగా జగిత్యాల వరకు చేపట్టిన జాతీయ రహదారి-563 నాలుగు లేన్ల విస్తరణ పనులే ఇందుకు నిదర్శనం. మరో పక్క రాష్ట్ర పరిధిలోని రహదారులను తెలంగాణ ప్రభుత్వం రూ.వందల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకుల నిర్లక్ష్యానికి గురైన రోడ్లు ఇప్పుడు ఎటు చూసినా అద్దంలా మెరుస్తున్నాయి..
అప్పటి కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ కృషితో..
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు చేసిన కృషి ఫలితంగా వరంగల్ నుంచి కరీంనగర్ మీదుగా జగిత్యాల వరకు ఉన్న రహదారిని 2014 డిసెంబర్లో జాతీయ రహదారిగా గుర్తించారు. జాతీయ రహదారుల కోసం వినోద్‌కుమార్ మరిన్ని ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా కరీంనగర్ వైపు మన జిల్లా నుంచి అనేక రాష్ట్రాలకు రవాణా ఎక్కువగా ఉంటుంది. ఎన్‌హెచ్-563ని ఎన్‌హెచ్ 163కు కలుపుతూ సిరిసిల్ల, కామారెడ్డి, జిల్లాల నుంచి నుంచి పిట్లం వరకు ఉన్న 165 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారిగా, ఇదే కాకుండా జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ఎన్‌హెచ్-563 ద్వారా పెద్దపల్లి జిల్లా కేంద్రాన్ని కలుపుతూ కాల్వ శ్రీరాంపూర్, కిష్టంపేట, కల్వపల్లి, మోరంచపల్లి, రామప్ప ఆలయం, నుంచి జంగాలపల్లి వద్ద ఎన్‌హెచ్-163ని కలిపేందుకు ప్రతిపాదించారు. అదేవిధంగా ఎన్‌హెచ్-563 నుంచి రవాణా ఎక్కువగా ఉంటుంది. దీనికి అనుబంధంగా మరికొన్ని ప్రతిపాదనలు కేంద్రానికి పంపారు. వాటిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తుంగలో తొక్కేసింది. వినోద్‌కుమార్ కృషితోనే ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట మీదుగా మెదక్ వరకు ఉన్న రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించారు. దీనికి భూసేకరణ అవసరం కూడా లేదు. టెండర్ కూడా ఎప్పుడో పూర్తయ్యింది. ఇప్పుడిప్పుడు ఇరువైపులా చెట్లు కొట్టే పనులు నడుస్తున్నాయి. హైదరాబాద్- భూపాలపట్నం నేషనల్ హైవే-163 పనుల్లో సైతం సాంకేతిక ప్రమాణాలు పాటించడం లేదని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఎక్కడా జంక్షన్లు సక్రమంగా లేవు, ప్రమాదకరంగా నిర్మించారు.
టెండర్లు పిలిచి ఏడాది దాటినా..
కరీంనగర్- వరంగల్ జాతీయ రహదారి-563 నాలుగు లైన్ల విస్తరణ కోసం రూ. 2,146.86 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2022 మార్చి 8న ఉత్తర్వులు జారీ చేసింది. అదే నెలలో టెండర్లు పిలువగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థకు దక్కించుకుంది. ఏడాది క్రితమే వర్క్ అగ్రిమెంట్ కూడా నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఇండియా(ఎన్హెచ్ఏఐ)తో కుదుర్చుకుంది. 68 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రహదారి విస్తరణకు 80 శాతం భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణ 85 శాతం పూర్తయితేనే నిర్మాణ సంస్థకు అపాయింట్మెంట్ టైం ఇస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం 85 శాతానికి మించి భూసేకరణ పూర్తయ్యిందని అంటున్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని బీజేపీ నేతలు ఏడాది కాలంగా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తీరుగా ఉంది. కిలోమీటరుకు రూ.31 కోట్ల చొప్పున వెచ్చించి ఈ రహదారి నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేయాలనే ఒప్పందం ఉంది. అగ్రిమెంట్ జరిగి ఏడాది పూర్తవుతోంది. ఇంకా పనులే ప్రారంభించకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు..
రాష్ట్ర రహదారులు చకచకా..
కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన రోడ్ల పనులు మాత్రం చకచకా పూర్తయి అద్దంలా మెరిసి పోతున్నాయి. రూ.25 కోట్లతో ధర్మసాగర్ రిజర్వాయర్ దగ్గర నుంచి వేలేరు మండల కేంద్రం వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి. భీమదేవరపల్లి మండలం 365 డీజీ నేషనల్ హైవేను ఆనుకుని గట్ల నర్సింగాపూర్ స్టేజీ నుంచి కొత్తకొండ వరకు రూ.16 కోట్లతో డబుల్ రోడ్డు పనుల చివరి దశకు చేరుకున్నాయి. కాజీపేట, కోమటి పల్లి, కమలాపూర్ మండలం ఉప్పల్‌లో చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల్లో రాష్ర్టానికి సంబంధించినవి మొత్తం పూర్తయ్యాయి. కేవలం రైల్వే శాఖకు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలా రాష్ట్రంలోని రహదారులను తెలంగాణ ప్రభుత్వం అందంగా తీర్చిదిద్దుతుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం జాతీయ రహదారుల విస్తరణలో పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న తీరుపై జిల్లా ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.