మన ఆడబిడ్డలను కన్నీళ్లు పెట్టించిన పాకిస్థాన్ ఉగ్రమూకలను భారత సైన్యం మట్టుబెట్టింది. మళ్లీ భారతావని వైపు చూడాలంటే పాక్ వెన్నులో వణుకు పుట్టేలా ‘ఆపరేషన్ సిందూర్’తో చావు దెబ్బకొట్టింది. మన దగ్గర అత్యాధునిక ఆయుధ సంపత్తి ముందు పాకిస్థాన్ నిలువ లేదని మరోసారి నిరూపించింది. ఈ ఆపరేషన్ దేశ ప్రజల్లో ధైర్యం, ఆత్మవిశ్వాన్ని నింపిందని మన మాజీ జవాన్లు దేశ సైన్యాన్ని ప్రశంసిస్తున్నారు. దేశం పిలుపునిస్తే తామూ యుద్ధంలో పాల్గొందుకు సిద్ధం అంటున్నారు.
ఒకే రోజు 35 డ్రోన్లు కూల్చేశాం..
భీమదేవరపల్లి, మే 10 : ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్ సరిహద్దు రాజస్థాన్ రాష్ట్రంలోని గంగానగర్‌లో డ్యూటీ చేస్తున్నా. శత్రుమూకలను సమర్థవంతంగా ఎదుర్కొని తిప్పికొడుతున్నాం. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం మనదేశంలోని గ్రామాలను కేంద్రప్రభుత్వం బ్లాక్ అవుట్ చేసింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో డ్రోన్లను ఎదుర్కోవడం సాధ్యమవుతున్నది. ఇండ్లల్లో ఇన్వర్టర్లు ఉన్నవారిని కూడా లైట్లు వేయొద్దని చెబుతున్నాం. లైట్ల ద్వారా వచ్చే వేడిమి వల్ల డ్రోన్లకు ఆచూకీ అలవోకగా తెలుస్తుంది. అందుకే కంటికి రెప్పలా గస్తీ కాస్తున్నాం. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దీటుగా సమాధానం ఇస్తున్నాం.
శుక్రవారం ఒక్క రోజే 35 వరకు డ్రోన్లను కూల్చివేశాం. 20 ఏళ్ల క్రితం బీఎస్ఎఫ్లో శిక్షణ పొందాను. పాకిస్తాన్ సరిహద్దులోని రాజస్తాన్‌లో రెండేళ్లు, బంగ్లాదేశ్ సరిహద్దులోని నార్త్ బెంగాల్లో ఐదేళ్లు, ఛత్తీస్‌గఢ్‌లోని నక్సలైట్ ఏరియాలో నాలుగేళ్లు, మూడేళ్లు వెస్ట్ బెంగాల్లో, ప్రస్తుతం రాజస్తాన్‌లోని గంగానగర్‌లో విధులు నిర్వర్తిస్తున్నా. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను కంసాలి పని చేసుకుంటూ కాలం వెల్లదీసేవాన్ని. అలాంటి నాకు బీఎస్ఎఫ్లో ఉద్యోగం వచ్చింది. 20 ఏళ్లుగా దేశ రక్షణ కోసం తుపాకీ పట్టకోవడం గర్వంగా ఉంది.
-శ్రీరామోజు కృష్ణ, హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలం, ముల్కనూరు
మురళీనాయక్ త్యాగం మరువలేనిది..
జనగామ, మే 10 (నమస్తే తెలంగాణ) : జమ్మూ కాశ్మీర్లో భారత్-పాక్ మధ్య జరుగుతున్న యుద్ధం లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీనాయక్ వీరమరణం చెందడంపై జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 25 ఏళ్ల వయసులోనే మాతృభూమి కోసం ప్రాణా లు అర్పించిన ఆయన త్యాగం ఎప్పటికీ మరువలేనిదని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ శనివారం ఒక ప్రకటనలో ఘన నివాళులర్పించారు.
తగిన మూల్యం చెల్లించుకున్నది
ఇనుగుర్తి, మే10: ఆర్మీ పిలిస్తే యుద్ధంలో పా ల్గొంటా. భరతమాత కోసం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నా. 1989 నుంచి 2019 వరకు 30 సంవత్సరాలు దేశ రక్షణకు బోర్డర్లో పనిచేశా. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో పాకిస్థాన్‌తో పోరాడాను. ఆ సమయంలో మాకు బోఫోర్స్ గన్స్ ఎక్కువగా ఉపయోగపడ్డాయి. గతంతో పోల్చితే ఇప్పుడు భారత్ వద్ద అత్యంత ఆధునికమైన, శక్తివంతమైన ఆయుధ సంపత్తి ఉన్నది. ఎస్ 400 రక్షణ వ్యవస్థ పనితీరు అద్భుతం. పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకున్నది.
– శీలం మధుసూదన్‌రెడ్డి, ఆర్మీ మాజీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్, ఇనుగుర్తి మండలం, మహబూబాబాద్ జిల్లా
పాకిస్థాన్‌కు పరాభవం తప్పదు
నర్సింహులపేట, మే 10: 1972 లో బీఎస్ఎఫ్లో ఉద్యోగం వచ్చింది. భారత్ ఎప్పుడు ఎలాంటి యుద్ధం వ చ్చినా వెనకడుగు వేయలేదు. పాకిస్థా న్, చైనా బోర్డర్లో విధులు నిర్వర్తిం చా. జమ్మూకశ్మీర్, పంజాబ్, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీలో 24 ఏళ్ల పాటు పని చేశా. నేను ఉద్యోగం చేసేటప్పుడు రాత్రి, పగలు రహదారులను పరిశీలిస్తూ, అర్ధరాత్రి చీకట్లో చిన్నచిన్న దీపాలు పట్టుకొని కాపాలా ఉండేవాళ్లం. పాకిస్థాన్ కవ్వింపు చర్య లు చూస్తే మళ్లీ బీఎస్ఎఫ్లో వెళ్లాలనిపిస్తున్నది. కానీ, ఇప్పుడు నా వయ స్సు 73 సంవత్సరాలు. భారత్‌తో పె ట్టుకుంటే ఓటమి తప్పదు.
– అజ్మీరా సత్యనారాయణ రిటైర్డ్ బీఎస్ఎఫ్ ఉద్యోగి, నర్సింహులపేట
యుద్ధం దేశ ప్రజల్లో ధైర్యం నింపింది..
సుబేదారి, మే 10 : మాది హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామం. నేను 2001లో ఆర్మీలో సైనికుడిగా చేరాను. 2019లో హవల్దార్ హోదాలో రిటైర్డ్ అయ్యాను. ఎక్కువ కాలం ఆర్మీ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేశా. 2007 నుంచి 2009 వరకు జమ్ములోని పాకిస్థాన్ సరిహద్దు రజోరీ జిల్లా తానమాడి ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్ విభాగంలో పనిచేశా. 18 ఏళ్లు ఆర్మీలో పని చేసి రిటైర్డ్ అయ్యాను. మన దేశ ఆడబిడ్డల సిందూరాన్ని తుడిచివేసిన పాకిస్థాన్ ఉగ్రమూకలకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’తో గట్టి సమాధానం చెప్పింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని తొమ్మిది పాక్ ఉగ్రవాదుల స్థావరాలను పిన్‌పాయింట్‌గా మన గగనతల క్షిపణి దళాలు నేలమట్టం చేశాయి. పాకిస్థాన్‌కు మనమంటే ఏంటో రుచి చూపించాయి. ఈ ఆపరేషన్ భారత ప్రజల్లో ధైర్యం, సాహసం నింపింది. మనతో పెట్టుకుంటే నాలుగు రోజుల్లోనే పాకిస్థాన్ కుప్పకూలుతుంది. యుద్ధం తీవ్రతరమైతే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సైనిక బోర్డు నుంచి ఎప్పుడు పిలుపు వచ్చినా దేశం కోసం పాకిస్థాన్‌తో యుద్ధం చేయడానికి వెళ్తా.
– రిటైర్డ్ ఆర్మీ జవాన్ కావటి భిక్షపతి
భారత సైన్యం ముందు పాక్ నిలువలేదు
ఖానాపురం, మే 10 : భారత సైన్యం ముందు పాకిస్థాన్ సైన్యం నిలువలేదు. పాకిస్థాన్‌తో పూర్తిస్థాయిలో యుద్ధం చేస్తే 24 గంటల్లోనే ఆ దేశాన్ని మట్టుపెట్టగల శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయి. 2001 నుంచి 2025 వరకు ఆర్మీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి, ఇటీవలే రిటైర్డ్ అయ్యా. దేశం కోసం పిలుపు వస్తే తిరిగి విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నా. 2003 నుంచి 2006 వరకు జమ్మూ కశ్మీర్లో విధులు నిర్వర్తించా. అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది.
పాకిస్థాన్ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటారు. నేరుగా యుద్ధం చేసే ధైర్యం వారికి లేదు. టెర్రరిస్టులను షెల్టర్ ఇచ్చి, వారిని కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం భారత్ వద్ద అధునాతన ఆయుధ సంపత్తి ఉన్నది. నాకు యుద్ధంలో నేరుగా పాల్గొనే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చినా సంతోషమే. భరతమాత కోసం సదా సిద్ధంగానే ఉంటా.. ఈ సారి పాకిస్థాన్‌తో తాడోపేడో తేల్చుకోవాలి. మళ్లీ భవిష్యత్‌లో పాకిస్థాన్ భారత్‌తో యుద్ధం అంటేనే వణికిపోవాలి.
– రిటైర్డ్ హవల్దార్ కుందెనపల్లి రమేశ్