వర్ధన్నపేట, ఫిబ్రవరి 26 : పేదింటి ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామగా మారి ‘కల్యాణలక్ష్మి’ రూపంలో పెళ్లి కానుక అందిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి మండలానికి చెందిన 145 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద అమ్మాయిల వివాహానికి ముందే డబ్బు లు అందేలా అధికారులు, ఎమ్మెల్యేలు ప్రయత్నించాలన్నారు. దీనివల్ల తల్లిదండ్రులకు ఆర్థికభారం తగ్గుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా లేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ తాము అధికారంలోకి వస్తే రూ.50వేలు అమ్మాయిల వివాహానికి అందిస్తామని మెనిఫెస్టోలో చేర్చిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చిన్న గ్రామాల్లో కూడా రూ.2 నుంచి రూ.3 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేస్తున్నదని వివరించారు. ఈ అభివృద్ధి పనులను బోర్డులపై రాయించి జీపీల వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు.
యాసంగిలో వరి పంట సాగు చేయండి.. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పిన బీజేపీ నేతలను రైతులు నిలదీయాలని మంత్రి దయాకర్‌రావు అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరి సాగు చేయమని చెప్పడంతో కొంతమంది రైతులు పంట వేశారని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేవలం రా రైస్ మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో యాసంగిలో కేవలం దొడ్డు రకం వరి మాత్రమే సాగవుతుందన్నారు. కేంద్రం కొనుగోలు చేయకపోతే ఈ ధాన్యాన్ని రైతులు ఎక్కడ అమ్ముకోవాలో బీజేపీ నాయకులు చెప్పాలని ప్రశ్నించారు. అన్నదాతలు కూడా బీజేపీ నాయకులను నిలదీయాలని కోరారు.
వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో రూ.50 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే అరూరి తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ప్రజలు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఇబ్బందులను గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు దేశంలో ఎక్కడాలేని విధం గా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారా వు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, తహసీల్దార్ నాగరాజు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాల్‌రావు పాల్గొన్నారు.
పర్వతగిరి : పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తూ సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల ఆత్మ బంధువుగా నిలుస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. పర్వతగిరిలోని క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన 215 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.2 కోట్ల 15లక్షల 24వేల 940 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలకు దేవుడు సీఎం కేసీఆర్.. అని నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వం రోల్ మోడల్‌గా ఉందని చెప్పారు. అనంతరం బూర్గుమళ్ల గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్ ఓరుగంటి శ్రీనివాస్ శనివారం మృతిచెందగా, పార్థివదేహం వద్ద నివాళుల ర్పించారు. జడ్పీటీసీ సింగ్‌లాల్, తహసీల్దార్ మహబూ బ్ అలీ, ఎంపీపీ కమల పంతులు, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్లు మనోజ్‌కుమార్ గౌడ్, గొర్రె దేవేందర్, మార్కెట్ డైరెక్టర్లు శాంతిరతన్‌రావు, పట్టాపురం ఏకాంతం గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు సర్వర్, షబ్బీర్ అలీ, సర్పంచ్‌లు మాలతీరావు, తౌటి దేవేందర్, అమడగాని రాజు, రేణుక, ఎంపీటీసీలు రాజు, మహేంద్ర పాల్గొన్నారు.
– లబ్ధిదారు రాపోలు రేణుక
‘కల్యాణలక్ష్మి పథకంతో నా జీవితం నిలబడింది. నిరుపేదలైన నా తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ గత ఏడాది పెండ్లి చేస్తే నెల రోజులకే నా భర్త ప్రమాదంలో మృతి చెందిండు. నాకు మరో సంబంధం వచ్చింది. కానీ డబ్బులు లేకపోడంతో పెళ్లి ఎలా చేయాలో తెలియక తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురైండ్లు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా సీఎం కేసీఆర్ ఇచ్చిన రూ.లక్షతో నాలుగు నెలల కింద నాకు పెండ్లి జరిగింది. ఎక్కడ అప్పు చేయకుండా కల్యాణలక్ష్మి డబ్బులతోనే నా తల్లిదండ్రులు పెండ్లి చేసిండ్లు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నేను, నా కుటుంబం రుణపడి ఉంటుంది.’ అని ఇల్లంద గ్రామానికి చెందిన రాపోలు రేణుక తెలిపింది.