ఈసారి పత్తి రైతు పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు ప్రతికూల పరిస్థితులతో పూత, కాతపై ప్రభావం చూపి ఆశించిన దిగుబడి రాకపోగా మరోవైపు చేతికొచ్చిన అరకొర పంటకు ‘మద్దతు’ కరువైంది. భారీ వర్షాలతో ఇప్పటికే నష్టపోయి కుంగిపోతున్న రైతులను పెట్టుబడి భారం పెరగడం మరింత కలవరపెడుతున్నది. దీనికి తోడు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోగా ప్రైవేట్‌లో మాత్రం కొనుగోళ్లు జోరందుకున్నాయి. అలాగే వ్యాపారుల మాయా జాలంతో అక్కడా రైతుకు నష్టమే కలుగుతున్నది. అటు వరంగల్‌లోని
ఎనుమాముల మార్కెట్లోనూ కొనుగోళ్లు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వ మద్దతు ధర దక్కకపోవడంతో నిరాశే మిగులు తున్నది. గురువారం క్వింటా పత్తికి రూ.7,010 ఉండగా రోజురోజుకూ తగ్గుతూనే ఉంది. దీనికి తోడు మార్కెట్లో కనీస వసతులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికారుల పర్యవేక్షణా లోపం స్పష్టంగా కనిపిస్తున్నది.
– వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ)/కేసముద్రం
తేమ పేరుతో ధర తగ్గింపు.. తూకంలో మోసం వల్ల జనగామ జిల్లాలో పత్తి రైతు క్వింటాల్‌కు రూ.2వేల వరకు నష్టపోతున్నాడు. కాయకష్టం చేసి.. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పత్తి పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయని ఫలితంగా అడిగిన ధరకు రైతు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా 20 లక్షల టన్నుల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
అయితే పత్తి సేకరణ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా సీసీఐ జాడ లేకపోవడంతో గ్రామాల్లో కమీషన్ ఏజెంట్లు, పట్టణ కేంద్రాల్లో చిల్లర కాంటా వ్యాపారులు.. మిల్లుల యజమానులు రైతుల వద్ద పత్తిలో తేమ ఆధారంగా ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వరంగ సంస్థ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసే వరకు ప్రైవేట్ కొనుగోళ్లలో పత్తికి కనీస మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో నాణ్యత ఉన్నా వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు.
వర్షాలతో పత్తి రంగు మారడాన్ని ఆసరాగా చేసుకొని మిల్లుల్లో యజమానులు, బయట మధ్యవర్తులు మంచి పత్తికి కూడా సవాలక్ష కొర్రీలు పెట్టి ధర తగ్గించి కొంటున్నారు. వాస్తవానికి 8 శాతం తేమ ఉంటే ఎ-గ్రేడ్ రకం పత్తిగా క్వింటాల్‌కు రూ.7,521, తేమ 9 నుంచి 12 శాతం ఉంటే ఒక్కో శాతానికి రూ.75 తక్కువకు కొనుగోలు చేయాలన్న నిబంధనలున్నాయి. ప్రైవేటు మిల్లుల్లో యజమానులు, ఏజెంట్లు, మధ్యవర్తులు మాత్రం రూ. 5,500 నుంచి రూ. 6,250 వరకు చేతిలో పెడుతున్నారు.
దీంతో ఒక్కో రైతు రూ. 1000 నుంచి రూ. 1500 వరకు ధర నష్టపోతుండగా..ఇష్టారీతిలో సాగుతున్న తూకంలోనూ మోసపోతున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలు, తేమ శాతాన్ని సూచించే యంత్రాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో జిల్లాలో అటు మిల్లుల్లో, ఇటు చిల్లర కాంటాల వ్యాపారులు యథేచ్ఛగా రైతులను దోచుకుంటున్నారు. పత్తిలో నాణ్యత ప్రమాణాలు బాగానే ఉన్నా.. తేమ యంత్రాల్లో మాయాజాలంతో రైతన్న నెత్తిన టోపీ పెడుతున్నారు. గ్రామాల నుంచి వచ్చే వాహనాల డ్రైవర్లకు కమీషన్లు ముట్టజెప్పి రైతులు తెచ్చిన పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.
కొత్త పత్తి మార్కెట్‌కు వస్తున్నా సీసీఐ ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో కొనుగోలు విషయంలో ప్రైవేట్ వ్యాపారులది ఆడింది ఆట.. పాడింది ‘పాట’గా మారింది. వారు చెప్పిన ధరకే పత్తి రైతు అమ్ముకోవాల్సి వస్తున్నది. మహబూబాబాద్ జిల్లాలో గతేడాది 84,980 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. మార్కెట్లో ధర తగ్గడంతో ప్రభుత్వం క్వింటాల్‌కి రూ.7020 చొప్పున మద్దతు ధర అందించింది. ఈ ఏడాది 78,540 ఎకరాల్లో రైతులు పత్తి పంట వేయగా, ఆగస్టు చివరి, సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలతో పూత, కాత రాలిపోయి దిగుబడి పూర్తిగా తగ్గింది.
ట్టుకు అక్కడక్కడా ఉన్న కాయలు పగిలి పంట చేతికొచ్చే సమయంలో వరుసగా పడుతున్న వర్షానికి పత్తి రంగు మారుతున్నది. తీరా ఆ పత్తిని మార్కెట్‌కు తీసుకెళ్తే నాణ్యత లేదనే సాకుతో వ్యాపారులు ధర పూర్తిగా తగ్గిస్తున్నారు. మార్కెట్లో క్వింటాల్ పత్తి రూ.5 వేల నుంచి రూ.7వేల వరకు పలుకుతున్నది. ఎకరానికి 8-10 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 2-3 క్వింటాళ్లే వస్తుండడం, మార్కెట్లో ధర పూర్తిగా తగ్గడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రైతులకు రూ. 7,521 మద్దతు ధర కల్పించి ఆదుకోవాల్సిన సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నది. జిల్లాలోని కేసముద్రం మార్కెట్లో గురువారం పత్తి క్వింటాకు గరిష్ఠంగా రూ. 7,066, కనిష్ఠంగా రూ.6,659 ధర పలికింది.
రైతులు ఎకరం భూమిలో పత్తి సాగు చేసేందుకయ్యే ఖర్చు ఇలా ఉం ది. మూడు సా ర్లు దుక్కి దున్నడానికి రూ.4500, అచ్చు వేసేందుకు రూ.1500, రెండు విత్తన ప్యాకెట్లకు రూ.1700, విత్తడానికి కూలీ రూ.900, గొర్రు తోలేందుకు రూ.6వేలు, కలుపు తీ సేందుకు రూ.5వేలు, మందులకు రూ.2 వేలు, ఎరువుల బ స్తాలకు రూ.4వేలు, మందుల పిచికారీకి రూ.5 వేలు, ఎకరం పత్తి ఏరేందుకు రూ.4,500 మొత్తం సుమారుగా రూ. 35, 100 ఖర్చవుతున్నది. అయితే ప్రస్తుతం ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది. క్వింటాకు రూ.7 వేల చొ ప్పున రూ.21వేల నుంచి రూ.28 వేలు వస్తున్నాయి. పత్తికి మద్దతు ధర చెల్లించినా రైతులకు పెట్టుబడి వచ్చే అవకాశం లేదు. దీంతో వారు అప్పుల్లో కూరుకుపోతున్నారు.
ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో రెండోదైన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈ ఏడాది కొత్త పత్తికి ఒకరోజూ కూడా మద్దతు ధర దక్కలేదు. గతేడాది అక్టోబర్ 16 వరకు ఈ మార్కెట్లో రైతులు 22,104 క్వింటాళ్ల పత్తి అమ్మారు. అప్పట్లో క్వింటా పత్తికి ప్రభుత్వ మద్దతు ధర రూ.7,020 ఉండగా, దానికంటే ఎక్కువగా గరిష్ఠంగా రూ. 7,070 దక్కింది. ఈ ఏడాది బుధవారం వరకు రైతులు 22,088 క్వింటాళ్ల పత్తి విక్రయించారు. ఇప్పటి వరకు ఇక్కడ గరిష్ఠ ధర క్వింటాకు రూ.7,500 మాత్రమే దక్కింది. ప్రస్తుతం ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 7,521. గురువారం ఒకే లాట్ వద్ద మార్కెట్ అధికారులు జెండా పాట నిర్వహించగా వ్యాపారులు గరిష్ఠ ధర రూ.7,010 వరకు పాడి ఆగారు. దీని ఆధారంగా ఇతర లాట్ల వద్ద వేలం పాట లేకుండానే ధర నిర్ణయించారు. బుధవారం గరిష్ఠ ధర రూ.7,060 ఉండగా, గురువారం రూ.7,010కి తగ్గింది.
పత్తి పంట సాగులో ఈ ఏడాది నష్టాలే. మొదట్లో విత్తనాలు సరిగా మొలువలె. అప్పుడేమో వానలు పడలే. తర్వాత అధిక వర్షాల వల్ల పంట ఏపుగా పెరగలె. పూత కాత తగ్గడం వల్ల దిగుబడి సగానికి పడిపోయింది. గతంలో ఒక ఎకరం పత్తి పంటలో ఆరుగురెడుగురు కూలీలు పత్తి ఏరితే ఇప్పుడు వానలతో తడవడం వల్ల పది మంది పనిచేయాల్సి వస్తున్నది. ఇలా పెట్టుబడి భారం పెరిగింది. తీరా అమ్మేందుకు మార్కెట్‌కు తెస్తే ఏదో ఒక లాటు వద్ద జెండాపాటతో గరిష్ఠ ధర నిర్ణయించి మిగతా లాట్లన్నింటికి వ్యాపారులు తమ ఇష్టమొచ్చిన రేటు నిర్ణయిస్తున్నరు. పేరుకే జెండాపాట. గరిష్ఠ ధరపై ఇతర లాట్లన్నింటికి రూ. వెయ్యి వరకు రేటు తగ్గించి కొంటున్నరు.
– కొత్త వినయ్, రైతు, పెద్దాపూర్, ఆత్మకూరు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికీ సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. దీంతో రైతులు ప్రైవేట్ పత్తి మిల్లులకు తీసుకెళ్లి విక్రయించుకుంటున్నారు. జిల్లాలోని కాటారం సెంటర్లో రుద్ర, మీనాక్షి కాటన్ మిల్లులు, చిట్యాల సెంటర్లో ఆంజనేయ, శ్రీ బాలమురుగన్ కాటన్ మిల్లులు, భూపాలపల్లి సెంటర్లో ఎంఎస్ఆర్ కాటన్ మిల్లులకు అధికారులు సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా అనుమతి ఇవ్వగా ఇప్పటివరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు. జిల్లాలో వరి తర్వాత రైతులు ఎక్కువగా పత్తి సాగు చేస్తారు.
వానకాలంలో జిల్లాలో 91,581 హెక్లార్లలో రైతులు పత్తి సాగు చేయగా ఇటీవలి వర్షాలకు పంట బాగా దెబ్బతిన్నది. సీసీఐ కేంద్రాలు మొదలుకాకపోవడంతో ప్రైవేటు మిల్లుల్లో దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఒక్కో మిల్లులో ఒక్కో రేటుతో (రూ. 6 వేల నుంచి రూ. 7 వేలు) వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో భూపాలపల్లి, చిట్యాలకు ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ యార్డులను మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదు. కాటారంలో ఉన్న మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు చేయడం లేదు.
ఎనుమాముల మార్కెట్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం రూ.55 కోట్ల ఆదాయం సేకరించేందుకు ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఇక్కడి యార్డుల్లో తాగునీరు అందుబాటులో లేదు. పరిశుభ్రత కొరవడింది. టాయిలెట్స్ నిర్వహణ లోపించింది. మహిళా రైతులకు ప్రత్యేక ఏర్పాట్లు లేవు. రైతుల పంట ఉత్పత్తులకు భద్రత కరువైంది. ప్రస్తుతం మార్కెట్లో కొన్నిచోట్ల సీసీ కెమెరాలున్నా నిర్వహణ లేక పనిచేయడం లేదు. రైతుల విశ్రాంతి భవనం నిర్వహణ అటకెక్కింది. వీటికితోడు ఇంటర్నెట్ సమస్యతో తూకం మిషన్లు సరిగా పనిచేయడం లేదు. జిల్లాలో 14 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఒక్కటీ ప్రారంభం కాలేదు.
నాకున్న 1.10 ఎకరాల్లో పత్తి సాగు చేశాను. అకాల వర్షాలు, వాతావరణం అనుకూలించక ఐదు క్విం టాళ్ల దిగుబడి వచ్చే అవకాశం లేదు. డిసెంబర్ వరకు కాయాల్సిన పత్తి పూత, కాత లేకపోవడంతో ఈ నెలలోనే తీసేస్తున్నా. దిగుబడి లేక.. ధర రాక.. పెట్టిన పెట్టుబడి ఎల్లక అప్పుల పాల య్యే పరిస్థితి వచ్చింది. రైతులకు పెట్టుబడి సాయం ప్రభు త్వం అందించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతు న్నాం.ప్రభుత్వం ఇప్పటికైనా మద్దతు ధర వచ్చేలా చూడాలి.
-మల్లయ్య, రైతు, కల్వల
నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశా. ఒక ఎకరాకు రూ. 32 వేల చొప్పున నాలుగు ఎకరాలకు రూ. 1.28 లక్షలు పెట్టుబడి పెట్టాను. గతంలో వరుసగా కురిసిన వర్షాలకు పూత, కాత రాలిపోయి ఎకరాకు 4 క్వింటాళ్లలోపు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కూలీలకు డబ్బులు ఇవ్వడానికే పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చిన. క్వింటాల్‌కు రూ. 6,870 ధర పలికింది. రెక్కల కష్టం కూడా మిగులకుండా పోతున్నది. మద్దతు ధర కల్పించి మాలాంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలె.
– గుగులోత్ జగన్, రైతు, అలంకానిపేట