మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శించింది. అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టిపోటీనిచ్చి సత్తా చాటింది. తొర్రూరు, వర్ధన్నపేట పీఠాలు కైవసం చేసుకోగా, కేసముద్రంలో హస్తం పార్టీతో సమానంగా గెలిచింది. జనగామ, మహబూబాబాద్‌లోనూ అత్యధిక వార్డుల్లో విజయం సాధించింది. పలు చోట్ల రెండు పార్టీల మధ్య స్వల్ప ఓటింగ్ శాతమే తేడా ఉంది. అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుచుకోవడంతో గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తల సంబురం అంబరాన్నంటింది.
– హనుమకొండ, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ సత్తా చాటింది. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికలు జరిగిన 12 మున్సిపాలిటీల్లో రెండు చోట్ల విజయం సాధించింది. మరో రెండు చోట్ల సరిగ్గా అధికార కాంగ్రెస్‌కు సమానంగా వార్డులు గెలుచుకున్నది. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం పూర్తయ్యింది. తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో బీఆర్ఎస్ 9 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ 7 వార్డులకు పరితమైంది. చైర్ పర్సన్ ఎన్నికలో స్థానిక ఎక్స్ అఫీషియో హోదాలో స్థానిక ఎమ్మెల్యే ఓటుతో కాంగ్రెస్ బలం 8 అవుతుంది. ఇక్కడ చైర్మన్ స్థానాన్ని బీఆర్ఎస్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. వర్ధన్నపేట మున్సి పాలిటీలోనూ బీఆర్ఎస్ విజయం సాధించింది.
ఈ మున్సిపాలిటీలో 12 వార్డులకు ఆరు చోట్ల బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ 5 వార్డులకు పరిమితమైంది. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. బీఆర్ఎస్ రెబల్‌గా పోటీ చేసి గెలిచిన ఈ కౌన్సిలర్‌పై అధికార పార్టీ బెదిరింపులకు గురిచేస్తున్నది. చైర్ పర్సన్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో హోదాలో స్థానిక ఎమ్మెల్యే ఓటుతో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు బలం సమానం కానున్నాయి. స్వతంత్ర అభ్యర్థి ఇచ్చే మద్దతుతో ఇక్కడి చైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారనున్నది. కేసముద్రం మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరి 8 వార్డులు గెలిచాయి.
ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి సొంత మండల కేంద్రంలోని మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సత్తా చాటింది. జనగామ మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ బలాన్ని చూపింది. 30 వార్డుల్లో 13 చోట్ల గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. 12 వార్డులను గెలిచిన కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమైంది. ఇక్కడ కాంగ్రెస్ పొత్తుతో సీపీఎం ఒక వార్డును గెలుచుకున్నది. చైర్ పర్సన్ ఎన్నికలో కాంగ్రెస్, సీపీఎం కలిపి బీఆర్ఎస్తో సమానంగా సీట్లు ఉంటాయి. ఎక్స్ అఫీషియో హోదాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఓటుతో ఇక్క డ చైర్మన్ స్థానాన్ని బీఆర్ఎస్ గెలుచుకోనున్నది. మహబూబాబాద్ మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ బలాన్ని ప్రదర్శించింది. 36 వార్డుల్లో 11 చోట్ల గెలిచింది. మరో స్థానంలో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. భూపాలపల్లి ము న్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు 10 వార్డుల్లో గెలిచారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ బలాన్ని చాటింది. గతంలో ఏ ప్రతిపక్ష పార్టీకి సాధ్యం కాని విధంగా వార్డులను గెలిచింది. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, తొర్రూరు, వర్ధన్నపేట, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లో అప్పుడు అధికారంలోకి ఉన్న బీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఊసే లేకుండా పోయింది. 2020 ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో కలిపి 200 వార్డులకు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ 33 స్థానాల్లోనే గెలిచింది. గత ఎన్నికల్లో భూపాలపల్లి, మరిపెడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఒక్క వార్డును గెలుచుకోలేదు. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏకంగా 134 వార్డుల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష పార్టీగా ఈసారి బీఆర్ఎస్ సత్తా చాటింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, తొర్రూరు, వర్ధన్నపేట, డోర్న కల్, మరిపెడ, కేసముద్రం, ములుగు, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీల్లోని 260 వార్డులకు ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ 88 వార్డులలో గెలిచి గట్టి ప్రతిపక్షంగా నిలిచింది.
మున్సిపల్ ఎన్నికల్లో జాతీయ పార్టీ బీజేపీ ఉనికి నామమాత్రంగానే ఉన్నది. 12 మున్సిపాలిటీల్లో కలిపి 8 వార్డుల్లోనే గెలిచింది. తొర్రూరు, వర్ధన్నపేట, కేసముద్రం, జనగామ, స్టేషన్ ఘన్పూర్, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో బీజేపీ ఒక్క వార్డులోనూ గెలవలేదు. స్వతంత్ర అభ్యర్థులు గెలిచిన వార్డులతో పోల్చితే సగం స్థానాలకే పరిమితమైంది. 2020లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో 10 వార్డుల్లో గెలిచింది. ఈసారి రెండు స్థానాలు తగ్గాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒక్కటే అని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించినట్లయ్యింది.
మహబూబాబాద్, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ )/వర్ధన్నపేట : తొర్రూరు, వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ కృషి ఫలించింది. పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటుగా వార్డుల వారీగా ఇన్చార్జీలను నియమించడంతో పాటుగా విస్తృత ప్రచారం చేశారు. తొర్రూరులో బీఆర్ఎస్ విజయం సాధించడంపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి, ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకడ ఎర్రబెల్లి తిష్ట వేసి ఇంటింటికి వెళ్లి హస్తం వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు తమ హయాంలో చేసిన అభివృద్ధిని వివరించారు. దీంతో పాటు ఈనెల 8న బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనతో తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేసింది. బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.
