జనగామ, నవంబర్ 28(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన దీక్షా దివస్‌ను శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ చేపట్టిన దీక్ష మళ్లీ గుర్తుకొచ్చేలా ఈ నెల 29న దీక్షా దివస్‌ను బీఆర్ఎస్ నిర్వహిస్తున్నది.
పార్టీ శ్రేణులతో పాటు తెలంగాణ ఉద్యమకారులను సన్నద్ధం చేసేందుకు ఇప్పటికే జిల్లాలోని పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గాల ముఖ్యనాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశాలకు జిల్లా ఇన్చార్జిగా నియమితులైన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ హాజరై దీక్షా దివస్ విజయవంతానికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, అసమర్థ పాలనను ఎండగట్టి ప్రజలను చైతన్యవంతులను చేసేలా దీక్షా దివస్ వేదికగా బీఆర్ఎస్ శంఖారావం పూరించనున్నది.
జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి హాజరుకానున్న వేలాది మంది గులాబీ సైనికులతో ఉదయం 10 గంటలకు పట్టణంలోని నెహ్రూపార్కు నుంచి పాదయాత్ర ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా వరకు చేరుకుంటారని దీక్షా దివస్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. దీక్షా దివస్‌లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు హాజరవుతారని పల్లా తెలిపారు.