దుగ్గొండి, ఏప్రిల్ 8 : జాతీయ ఉపా ధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈజీఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం దుగ్గొండి మం డలం మహ్మదాపురంలో ఉత్తర యుద్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి హాజరై ఉత్తరాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహ్మదాపురంలో రూ.4.41 కోట్లతో బీటీ రోడ్డు పనులు, రూ.70లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే పెద్ది, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తోందన్నారు.
దీన్ని తిప్పికొట్టి బీజేపీకి బుద్ధిచెప్పేలా ప్రతిఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. గత ప్రభుత్వాల పాలనలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రజలను సీఎం కేసీఆర్ ఓ దేవుడిలా వచ్చి ఆదుకున్నారన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్, సాగునీరు, తాగునీరు, పంటల పెట్టుబడికి రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్ల వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేస్తే.. మోదీ సర్కారు ఈ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పేదలకు ఉపాధి కల్పించే పథకాన్ని లేకుండా చేసి ఆదాయాన్ని కార్పొరేట్ సంస్థలకు దోచి పెడుతోందన్నారు. తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ప్రజలు ఇక్కడి నుంచే ఉద్యమించాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.
పంటనష్ట పరిహారం అందించే బాధ్యత నాదే : ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
రాజకీయాలకతీతంగా పంటనష్ట పో యిన ప్రతి రైతుకు పరిహారం అందించే పూర్తి బాధ్యత తనదేనని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. వడగండ్ల వానతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతే సీఎం కేసీఆర్‌ను మండలానికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఎకరాకు రూ.10 వేలు నష్ట్ట పరిహారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దుగ్గొండి మండలం లో 11 వేల ఎకరాల్లో పంటనష్ట పోయి న రైతులకు త్వరలో చెక్కులు అందజేస్తామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నర్సంపేట నియోజకవర్గ అబివృద్ధికి రూ.64 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు, బీటీ రోడ్లు నిర్మించి, రోడ్ల మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. రెండు నెలల్లో రోడ్డు లేని గ్రామం లేకుం డా చేయడం తన లక్ష్యమన్నారు. ఐదేళ్ల కిందటే ఈజీఎస్‌ను వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే తీర్మానం చేశామన్నారు. ఉపాధి కూలీల పొట్టకొట్టేలా చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్వినీతానాజీవాకడే, వరంగల్ జడ్పీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, దుగ్గొండి ఎంపీపీ కాట్ల కోమల, వైస్ ఎంపీపీ పల్లాటి జైపాల్‌రెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ తోక ల నర్సింహారెడ్డి, నాచినపల్లి, మహ్మదాపురం పీఏసీఎస్ చైర్మన్లు సుకినె రాజేశ్వర్‌రావు, ఊరటి మహిపాల్‌రెడ్డి, ఎంపీటీసీలు చింతా లావణ్య, కొల్లూరి విజయామోహన్రావు, మోర్తాల రాజు, సర్పంచ్‌లు, క్లస్టర్ ఇన్చార్జిలు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.