కమలాపూర్, మే 10 : 2014లో బడే భాయ్ మోదీ.. 2023లో చోటేభాయ్ రేవంత్‌రెడ్డిలు ప్రజలను మోసం చేసి గద్దెనెక్కారని.. ఎవరు మోసగాళ్లో, ఎవరు పనిమంతులో గుర్తించి ఓటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కోరారు. ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో ఏర్పాటుచేసిన రోడ్‌షోలో కరీంనగర్ బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి మహిళలకు రూ.2500, రైతులకు 2లక్షల రుణమాఫీ, 500 బోనస్ అన్నడు ఇచ్చిండా? అని ప్రజలను ప్రశ్నించగా ఇవ్వలేదంటూ సమాధానమిచ్చారు. ఊసరవెల్లి రంగులు మారిస్తే రేవంత్‌రెడ్డి తారీఖులు మారుస్తుండని ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తానని ఎందుకు చేయలేదని అడిగిన ఆయన ‘కేసీఆర్ ఉన్నప్పుడు బాగున్నదా? ఇప్పుడు బాగున్నదా చెప్పాలని ప్రశ్నించగా.. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనంటూ చేతులెత్తి గట్టిగా నినాదాలు చేశారు. ఈ నెల 13న కారు గుర్తుకు ఓటేసి వినోద్‌కుమార్‌ను గెలిపిస్తే వలపటెద్దులాగ వినోద్, దాపటెద్దులాగ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిలు ఇద్దరు మీకు అందుబాటులో ఉండి పనిచేస్తారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నారదాసు లక్ష్మణ్‌రావు, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎంపీపీ రాణి, జడ్పీటీసీ కల్యాణి, సింగిల్‌విండో చైర్మన్ సంపత్‌రావు, తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, నాయినేని తిరుపతిరావు, నవీన్‌కుమార్, లక్ష్మణ్‌రావు, శ్రీకాంత్, రవీందర్‌రెడ్డి తదితరులున్నారు.
ఎంపీగా గెలిచి బండి సంజయ్ ఒక్కపనైనా చేసిండా?
ఐదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఒక్క పనైనా చేసిండా? నియోజకవర్గంలో ఒక్క శిలాఫలకమైనా ఉందా? ఏమన్నంటే మోడీ దేవుడంటడు ఒక్క బడైన, గుడైన కట్టిండా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెల్లారి లేస్తే హిందు, ముస్లిం అంటాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రేషన్ బియ్యంలో పసుపు కలిపి గ్రామాల్లో రాముని తలంబ్రాలు అయోధ్య నుంచి వచ్చినయని ప్రజలను మోసం చేసి దేవుని పేరుతో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. దేవుడంటే బీజేపీ వాళ్లకే ఉంటడా? కేసీఆర్ యాదగిరిగుట్టలో బ్రహ్మాండమైన లక్ష్మీ నర్సింహస్వామి గుడిని నిర్మించాడని, ఐదేళ్లలో ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణం పూర్తి చేయించని దద్దమ్మ బండి సంజయ్ అని ధ్వజమెత్తారు. బీజేపీ పుట్టి నలభై ఏళ్లు అయ్యిందని ఆ పార్టీ చెబితేనే మనం దేవుళ్లను మొక్కినమా? ఇండ్లలో పోచమ్మ, మైసమ్మకు మొక్కుతలేమా? రాముడు అందరికి దేవుడు బీజేపీ వాళ్లకే కాదన్నారు. అందరం మొక్కుతున్న రాముడు ఏమైన బీజేపీ వాళ్లకు ఓటు వేయాలని చెప్పుతున్నడా? రాముడి పేరు వాడుకుంటున్న మోసగాళ్లు బీజేపీ నాయకులు. ప్రధాని నరేంద్రమోదీ రూ. 30లక్షల కోట్లు దోచుకున్నడని.. కాదని బీజేపీ నేతలు బండి, ఈటల, కిషన్‌రెడ్డిలు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సవాల్ విసిరారు. బీజేపీని గెలిపిస్తే నల్లధనం వెనక్కి తీసుకొచ్చి పేదల ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తానని, ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన మోదీ ఇచ్చిండా ఆలోచన చేయాలన్నారు.
కేటీఆర్ రాకతో ఫుల్ జోష్
కేటీఆర్ రోడ్‌షోతో కమలాపూర్ గులాబీమయమైంది. కరీంనగర్ అభ్యర్థి వినోద్‌కుమార్ తరఫున ప్రచారం చేసేందుకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ఘన స్వాగతం పలికారు. వివిధ ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు ర్యాలీగా బయల్దేరి కమలాపూర్‌కు భారీగా చేరుకున్నారు. కేటీఆర్ తన ప్రసంగంలో కేసీఆర్ గురించి ప్రస్తావించినప్పుడు నినాదాలు చేస్తూ ప్రతిస్పందించారు. చేతులెత్తి గట్టిగా జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. రోడ్‌షోకు అశేష జనం తరలిరావడంతో సభ సక్సెస్ కాగా, బీఆర్ఎస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపించింది.
నయా పైసా తేని బండికి ఓటెందుకేయాలె..;– బోయినపల్లి వినోద్‌కుమార్,కరీంనగర్ ఎంపీ అభ్యర్థి
ఐదేళ్లు ఎంపీగా ఉండి కరీంనగర్‌కు నయాపైసా పనిచేయని బండి సంజయ్‌కి ఓటెందుకు వేయాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. తెలంగాణలో నలుగురు ఎంపీలు ఉన్నా ఒక్క నవోదయ పాఠశాల కూడా తీసుకురాలే. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమ తీసుకురాలేదన్నారు. 2014లో ఎంపీగా ఉన్నప్పుడు తాను కరీంనగర్ స్మార్ట్‌సిటీ కోసం వెయ్యికోట్ల నిధులు తెచ్చానని చెప్పారు.