వర్ధన్నపేట/తొర్రూరు/రాయపర్తి/పెద్దవంగర/దేవరుప్పుల, మే 7 : దేశానికి అన్నంపెట్టే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని ప్రజలతో పాటు పార్టీ అధిష్టానం కూడా నమ్మకం కోల్పోయిందని ఎద్దేవా చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు. బుధవారం ఆయన వరంగల్ జిల్లా వర్ధన్నపేట, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. అలాగే రాయపర్తితో పాటు తొర్రూరు, పెద్దవంగర, జనగామ జిల్లా దేవరుప్పులలో పార్టీ ముఖ్యకార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు ప్రణాళిక లేకుండా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో రోజుల తరబడి కాంటాలు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనివల్ల అకాల వర్షాలకు ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కాంటాలు పూర్తయిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడం లేదని, సకాలంలో డబ్బులు ఖాతాల్లో జమచేయడం లేదన్నారు. ప్రధానంగా సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి రైతులకు ఎగనామం పెడుతున్నదని ధ్వజమెత్తారు.
ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ దివాలా తీసిందని చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ స్థాయిలో రాష్ట్రం అప్రతిష్ఠ మూటగట్టుకున్నదన్నారు. భవిష్యత్‌లో ఏ కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాదన్నారు. పాలన చేతగాని రేవంత్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో ఆరు చొప్పున ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను కేవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ద్వారా సాగునీరు, 24 గంటల విద్యుత్, పంట ఉత్పత్తుల కొనుగోలు, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేసింది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఇటీవల ఎలతుర్తిలో జరిగిన రజతోత్సవ సభ సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగం ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని తీసుకువచ్చిందన్నారు.
అంతం కాదిది ఆరంభం
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్ టెర్రరిస్టులు పొట్టన పెట్టుకున్న అమాయకుల ఆత్మకు శాంతి కలుగుతుందని ఎర్రబెల్లి అన్నారు. మన సైన్యం ఉగ్రమూకల స్థావరాలను నేలమట్టం చేయడమే కాకుండా టెర్రరిస్టులను మట్టుపెట్టడంపై దేశం గర్విస్తున్నదన్నారు. తిండికి గతిలేకపోయినా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ దేశంపైకి ముష్కరులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాల్సిందేన్నారు. మన త్రివిధ దళాలు తలచుకుంటే పాకిస్థాన్ నామరూపాలు లేకుండా పోతుందని, ఇది ఆరంభమేనని, అంతం కాదన్నారు.
ఇప్పటికే ప్రపంచ దేశాల మద్దతు కూడబెట్టిన ప్రధాని మోడికి రాజకీయాలకతీతంగా దేశం మద్దతుగా నిలుస్తుందన్నారు. మన పక్క దేశమైన చైనా తన వైఖరిని స్పష్టం చేయాలని, ప్రపంచానికి హాని చేస్తున్న తీవ్రవాదాన్ని అంతమొందించడంలో భారత్‌కు బాసటగా నిలవాలన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న జవాన్లకు, త్రివిధ దళాలకు సెల్యూట్ చేస్తున్నానని ఎర్రబెల్లి తెలిపారు. కాగా, రాయపర్తి మండలం జయరాంతండా(కే)కు చెందిన లావుడ్య నరేశ్ బీఆర్ఎస్లో చేరగా ఎర్రబెల్లి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మాజీ జీసీసీ చైర్మెన్ గాంధీనాయక్, బీఆర్ఎస్ నాయకులు గుడిపూడి గోపాల్‌రావు, పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, సిలువేరు కుమారస్వామి,మధుసూదన్, పసుమర్తి సీతారాములు, మంగళంపల్లి శ్రీనివాస్, తూర్పటి అంజయ్య, బిందు శ్రీనివాస్, ఏ ప్రదీప్ రెడ్డి, కుర్ర శ్రీనివాస్, ఎన్నమనేని శ్రీనివాసరావు, మణిరాజు, తూర్పటి రవి శంకర్, ఐలయ్య, సంజయ్, రామచంద్రయ్యశర్మ, యాదగిరిరావు, సుధీర్‌కుమార్, రఘు, పటేల్నాయక్, జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, పూస మధు, గారె నర్సయ్య, కర్ర రవీందర్‌రెడ్డి, కుందూరు రామచంద్రారెడ్డి, లేతాకుల రంగారెడ్డి, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, అయిత రాంచందర్, కుందూరు యాదగిరిరెడ్డి, భూక్యా భద్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఖాతాల్లో జమకాని డబ్బులు
ప్రస్తుత యాసంగిలో ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల ద్వారా 25 లక్షల టన్నుల దొడ్డు, 10.32 లక్షల టన్ను ల సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. ఇందుకోసం రైతులకు రూ.515.82 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇంత వరకు చెల్లింపుల ప్రక్రియ ప్రారంభించలేదన్నారు. వ్యవసాయశాఖ మంత్రి మా త్రం ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామన్న మాటలు ఆచరణలో జరగడం లేదన్నారు. అలాగే రైతులకు చెల్లించాల్సిన రూ.500 కోట్ల పెండింగ్ బోనస్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.