స్టేషన్ ఘన్పూర్, నవంబర్ 11 : కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ మూటముళ్లె సర్దుకుని ఉపాధి కోసం వలసబాట పట్టాల్సి వస్తుందని బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మండలంలోని కొత్తపల్లి, తాటికొండ, జిట్టెగూడెం, గార్లగడ్డ తండాలో కడియం శ్రీహరి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీహరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రజలనుద్దేశించి కడియం శ్రీహరి మాట్లాడుతూ దేశాన్ని, రాష్ర్టాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజల సమస్యలపై, పేదల అభివృద్ధి గురించి ఏనాడూ పట్టించుకోలేదన్నారు. కరెంటు సరిగా రాకపోవడంతో మోటార్లు, స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో సాగునీరు అందక పంటలు ఎండిపోయి అప్పులపాలై ఉపాధి కోసం వ్యవసాయాన్ని విడిచి బతుకుదెరువు కోసం హైదరాబాద్, బీవండి, సోలాపూర్, సూరత్‌కు వలస వెళ్లారని ఆయన గుర్తు చేశారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చడంతోపాటు ఉచితంగా 24 గంటలు కరెంటు అందిస్తున్నారని కడియం శ్రీహరి తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో ఏటా రెండు పంటలకు సాగునీరు అందుతూ రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ కరెంట్ కోతలు తప్పవన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని ఆయన కోరారు.
ఈ ఎన్నికల్లో తనను ప్రజలు ఆశీర్వదిస్తే నియోజకవర్గంలో సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తానని కడియం శ్రీహరి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసేదే చెబుతుందని, పేదల అభ్యున్నతి కోసం ఏమైనా చేస్తుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడంలేదన్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం రేషన్ షాపుల ద్వారా నిరుపేదలకు సన్న బియ్యం అందిస్తామన్నారు. తెల్లరేషన్ కార్డు కలిగిన ఆర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బొల్లపల్లి కృష్ణ, వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి, చిల్పూరు దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, జిల్లా నాయకుడు నరేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేశ్, మాజీ ఎంపీపీ జగన్మోహన్రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు అక్కనపల్లి బాలరాజు, గట్టు రమేశ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు రాపోలు మధుసూదనరెడ్డి, తోట వెంకన్న, సర్పంచ్‌లు తాటికొండ సురేశ్‌కుమార్, పోగుల సారంగపాణి, గోవిందు ఆనందం, చల్లా ఉమాసుధీర్ రెడ్డి, మాలోత్ లలితాహన్మంతు, ఎంపీటీసీలు వెంకటస్వామి, గన్ను నర్సింహులు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌రెడ్డి, పొన్న శ్రీను, జయపాల్, మాజీ సర్పంచ్‌లు బూర నరేందర్, ముత్యంరెడ్డి, సానాది సంధ్య రాజు, హిమబిందు, ఉప సర్పంచ్ ముక్కెర మహేందర్, జోగు లింగస్వామి, షౌకత్ అలి, ఇసాక్, ఐలోని సుధాకర్ పాల్గొన్నారు.