జయశంకర్ భూపాలపల్లి, జూలై 26 (నమస్తే తెలంగాణ)/కాళేశ్వరం/మహదేవపూర్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను బీఆర్ఎస్ బృందం బట్టబయలు చేసింది. మేడిగడ్డ వద్ద మానేరు, గోదావరి, ప్రాణహిత నదులు పుష్కలంగా ప్రవహిస్తున్నా కావాలనే లిఫ్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని బహిర్గతం చేసింది. నీటిని నిల్వ చేయకుండా కన్నెపల్లి పంపుహౌస్‌లోని 17 మోటర్లను రన్ చేసి రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసే అవకాశమున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ రైతుల నోట్లో మట్టి కొడుతున్నదని బృందం ధ్వజమెత్తింది.
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. ఉదయం 10 గంటలకు రామగుండం నుంచి చెన్నూరు మీదుగా కాళేశ్వరానికి చేరుకున్నది. ప్రాజెక్టు బ్రిడ్జిపై ఆగి కాళేశ్వరం వరద ప్రవాహాన్ని పరిశీలించింది. అనంతరం అక్కడి నుంచి కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించింది. రాజగోపురం వద్దకు రాగానే పార్టీ యువజన నాయకుడు జక్కు రాకేశ్ బృందానికి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. మహాగణపతికి పూజలు చేసి కాళేశ్వర ముక్తీశ్వరస్వామికి అభిషేకం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందాన్ని అర్చకులు శేష వస్ర్తాలతో సన్మానించారు. అనంతరం గోదావరి నది తీరం పుష్కరఘాట్ వద్ద త్రివేణి సంగమంలో గోదావరికి పూజలు చేసి హారతి ఇచ్చారు.

‘దేవుడా.. ఈ కాంగ్రెస్ నాయకు ల మనసు మార్చి.. వాళ్లకి మంచి బుద్ధి ప్రసాదించు’.. అని మాజీ మం త్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని వేడుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందాలని, రైతులు సుభిక్షంగా ఉం డాలని కోరుతూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూజలు చేశారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్‌రెడ్డి కాంగ్రె స్ నాయకుల బుద్ధి మారాలని ప్రత్యే క పూజలు చేసి, ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం కన్నెపల్లి పంపుహౌస్‌ను సందర్శించింది. అక్కడి మోటర్ల స్థితిగతులను కేటీఆర్ ఇరిగేషన్ ఎస్ఈ కరుణాకర్, ఈఈ తిరుపతిరావును అడిగి తెలుసుకున్నారు. 17 మోటర్లు పంపింగ్‌కు సిద్ధంగా ఉన్నాయా, ఏమైనా సాంకేతిక లోపాలు ఉన్నాయా, ఇప్పటికిప్పుడు మోటర్లు రన్ చేసి పంపింగ్ చేయొచ్చా అని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మానే రు, గోదావరి ప్రవాహం ఎంత వస్తుంది.. ప్రాణహిత ప్రవాహం ఎంత ఉందని తెలుసుకున్నారు.

మేడిగడ్డ వద్ద రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వృథాగా పోతుందని, అన్నారం బరాజ్ ద్వారా సుమారు 14 వేల క్యూసెక్కుల నీరు మేడిగడ్డ వైపు వదులుతున్నట్లు ఎస్ఈ, ఈఈలు కేటీఆర్‌కు వివరించారు. నీటిని నిల్వ చేయకుండానే 17 పంపులతో ప్రస్తుతం రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయవచ్చని చెప్పారు. అయితే, ఎన్డీఎస్ఏ నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో నీటిని పంపింగ్ చేయడం లేదని తెలిపారు. అనంతరం మేడిగడ్డ బరాజ్‌కు చేరుకొని ప్రాణహిత ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నేతలు నీటి ప్రవాహాన్ని చూస్తూ మురిసిపోతూ సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.