శాయంపేట, జనవరి 24 : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే సిట్ చీఫ్ సజ్జనార్ నోటీసులు ఇచ్చారని, వాటికి భయపడి పారిపోనని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని ఆయనకు అందిస్తానని, సేకరించిన సమాచారాన్ని ప్రజల ముందు పెడతానని, ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కని అన్నారు. శనివారం ఆయన శాయంపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అసలు నేరమే కాదన్నారు. కేవలం కుట్రపూరితంగా సిట్ అధికారులు నోటీసులు ఇస్తున్నారన్నారు.
ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నేతలకు సజ్జనార్ నోటీసులు ఇచ్చారని, ఎంత మందికి ఇస్తారని, 4 కోట్ల మందికి ఇవ్వండన్నారు. ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని, ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులు నిందితులు కారని, బాధితులేనని స్పష్టం చేశారు. హరీశ్‌రావు, కేటీఆర్‌తోపాటు తనకూ నోటీసులు ఇచ్చారని, ఏం చేసినా బెదిరింపులకు లొంగేది లేదన్నారు. తమ దగ్గరుండే సమాచారాన్ని తప్పకుండా పబ్లిక్ డొమైన్లో పెడుతామన్నారు. సీఎం దావోస్‌లో ఎంజాయ్ చేస్తుండగా, ఆయన డైరెక్షన్లో పోలీసులు పావులుగా మారి ఈ తతంగం చేస్తున్నారని అన్నారు.
పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90శాతం కేసీఆర్ పూర్తి చేస్తే.., పదిశాతం నిధులు ఇవ్వలేని సీఎం పాలమూరు బిడ్డ అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టును కూల్చేశారని, కూలిపోలేదని బీఆర్ఎస్ ఎప్పటి నుంచో చెబుతున్నదన్నారు. సింగరేణి తెలంగాణ కిరీటంలో వజ్రం లాంటిదని, ఎన్నో లాభాలు వచ్చేలా కేసీఆర్ చేశారన్నారు. కానీ, సింగరేణికి ఉన్న నైనీ కోల్‌బ్లాక్‌ను నీదా, నాదాఅని వాటాలు పంచుకోవడంలో కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ మహానగరంలో 9300 ఎకరాల భూమిని సేకరించి అందులో పరిశ్రమలు నెలకొల్పాలని సంకల్పిస్తే కాంగ్రెస్ హిల్ట్ పాలసీ తీసుకొచ్చి రూ.5లక్షల కోట్ల విలువైన భూమిని సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్ద మంత్రులకు బహిరంగంగానే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కోల్ బ్లాక్‌లో లెస్ వేసి తీసుకుంటే రాష్ర్టానికి అదనపు ఆదాయం వచ్చేదని, కానీ ఇప్పుడు ఎక్సెస్ వేసి తీసుకుంటున్నారంటే వచ్చే లాభాలను రింగ్ అయ్యి మనమే దోచుకుంటామన్న విధానం నడుస్తోందన్నారు. సైట్ విజిట్ అనే కొత్త విధానం పెట్టి కొత్త వాళ్లు ఎవరూ రాకుండా సంపద అంతా తమకే అని బహిరంగంగా కాంగ్రెస్ నాయకులు కొట్టుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి కాంగ్రెస్ దుర్మార్గాలను కేటీఆర్, హరీశ్‌రావు బయపెడుతుంటే రేవంత్‌రెడ్డి సర్కారు అటెన్షన్, డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నదన్నారు.
టీవీ సీరియల్ లాగా ట్యాపింగ్ వ్యవహారం!
సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్‌లో నోటీసులు ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. టీవీ సీరియల్ లాగా సంవత్సరాలుగా ట్యాపింగ్ వ్యవహారం నడుస్తున్నదని, దీనిపై లీకులిస్తూ మళ్లీ విచారణలంటూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను డైవర్షన్ చేసేందుకు ట్యాపింగ్ కేసును ముందుకు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఎన్నో హమీలిచ్చి ఒక్కటీ అమలు చేయని కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి, ఉప సర్పంచ్ దైనంపెల్లి సుమన్, గాజె రాజేందర్, గంటా శ్యాంసుందర్‌రెడ్డి, మారెపల్లి నందం, కొమ్ముల శివ, చెన్నబోయిన అజయ్, విద్యాసాగర్,నాయకులు,కార్యకర్తలున్నారు.