ములుగు, ఏప్రిల్4(నమస్తేతెలంగాణ) : ములుగు జిల్లాలో మంత్రి సీతక్క కనుసన్నల్లో పోలీస్ రాజ్యం నడుస్తున్నదని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై నమోదవుతున్న అక్రమ కేసులకు భయపడొద్దని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు అధ్యక్షతన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించగా, పెద్ది ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిపై అక్రమ కేసులు పెట్టించింది లేదని అన్నారు.
సోషల్ మీడియా వేదికగా తప్పులను ఎత్తిచూపినా కార్యకర్తలపై కేసులు నమోదు చేయించి వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో ఎవరూ అధైర్య పడొద్దని, నాయకత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ జరగలేదని, రైతు భరోసా ఇవ్వలేదని, బోనస్‌లు అందలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమైందని అన్నారు. కేసీఆర్ పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని అన్నారు. కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసేందుకు కృషి చేయాలని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 27న ఎల్క తుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ మహా సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా నుంచి సభకు 15 వేల మంది తరలిరావాలన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు నిర్వహించే రజతోత్సవ సభకు ములుగు జిల్లా నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలిరావాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కాకులమ ర్రి లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఏ సమస్య వచ్చినా తాను ముందుంటానని అన్నారు.
సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్, మాజీ ఎంపీపీలు గండ్రకోట శ్రీదేవీసుధీర్యాదవ్, సూడి శ్రీనివాస్‌రెడ్డి, వాణి శ్రీ, మాజీ జడ్పీటీసీలు తుమ్మల హరిబాబు, గై రుద్రమదేవి, పార్టీ పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, ములుగు, మల్లంపల్లి, వెంకటాపూర్ మండలాల అధ్యక్షులు సానికొమ్ము రమేశ్‌రెడ్డి, పాలె పు శ్రీనివాస్, రమణారెడ్డి, నాయకులు బేతెల్లి గోపాల్‌రెడ్డి, పోమానాయక్, ప్రదీప్‌రావు, మల్క రమేశ్, శ్రీనివాస్‌రెడ్డి, విజయ్‌రామ్‌నాయక్, భూక్యా జంపన్న, సునీల్‌కుమార్, వినయ్‌కుమార్, వేములపల్లి భిక్షపతి, వేల్పూరి సత్యనారాయణరావు, మాచర్ల ప్రభాకర్, మోహన్, గొర్రె సమ్మయ్య, మధుసూదన్‌రెడ్డి, తండా రమేశ్ తదితరులు పాల్గొన్నారు.