ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. జైలు నుంచి విడుదలైన సందర్భాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, నాయకులు ఆనందం వ్యక్తంచేస్తూ జై తెలంగాణ.. నినాదాలతో హోరెత్తించారు. కేసీఆర్‌ను ఎదుర్కోలేకే ఆయన కుటుంబసభ్యులపై అక్రమ కేసులు పెట్టారని, కొంత ఆలస్యమైనా కవిత విషయంలో నిజం, న్యాయమే గెలిచిందని పలువురు నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వరంగల్‌లోని శివనగర్ వద్ద నిర్వహించిన సంబురాల్లో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని బీఆర్ఎస్ శ్రేణులకు స్వీట్లు తినిపించారు. ఏ ఆధారాలు చూపకుండా అక్రమ కేసులు పెట్టినా కడిగిన ముత్యంలా బయటికి రావడమే కాకుండా రానున్న రోజుల్లో నిజం, ధర్మం గెలిచి ఈ యుద్ధంలో ఆమె విజయం సాధిస్తుందని ఆయన ధీమా గా చెప్పారు. అప్రూవర్‌గా మారాలని ఒత్తిడి చేసినా మొక్కవోని ధైర్యంతో ముందుకు నడిచి బెయిల్ సాధించడం గర్వకారణం అని ప్రశంసించారు.
అలాగే ఎనుమాముల మార్కెట్ వద్ద పటాకులు కాల్చి జై తెలంగాణ నినాదాలు చేశారు. హనుమకొండలో వడ్డెపల్లి చర్చి చౌరస్తాలో జరిగిన సంబురాల్లో బీఆర్ఎస్ నేత దాస్యం విజయ్‌భాస్కర్ పాల్గొన్నారు. భూపాలపల్లిలోని అంబేద్కర్ సెంటర్లో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో పటా కులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. జనగామ జిల్లా దేవరుప్పులలో జాతీయ రహదారిపై పటాకులు కాల్చి జై కేసీఆర్, జై కవితక్క అంటూ నినాదాలతో హోరెత్తించారు.
– నమస్తే నెట్వర్క్, ఆగస్టు 27