భూపాలపల్లి రూరల్/ఎల్కతుర్తి, ఏప్రిల్ 20: ఒకే వేదికపై లక్షలాది మంది జై తెలంగాణ అని నినదిస్తే అధికార పక్షానికి దడ పుట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివా రం భూపాలపల్లి మండలంలోని నేరేడుపల్లి, వజినేపల్లి, గొర్లవీడు, కొంపెల్లి గ్రామాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను సాధించి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు.
ప్రజలు రేవంత్‌రెడ్డి మోసపూరిత మాటలకు ఆశపడి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని అడిగితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. రజతోత్సవ సభ కోసం వాల్ రైటింగ్ చేయిస్తే వాటిని మలిపేస్తున్నారని, ఈనెల 26న నిర్వహించే జాబ్ మేళాను 27కు మార్చి పోలీసు అధికారులతో ప్రచారం నిర్వహిస్తున్నారని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, ఇలాంటి దికుమాలిన పనులు ఆపివేయాలని హెచ్చరించారు.
ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతున్నారని, కేసీఆర్‌ని కాదని రేవంత్‌రెడ్డిని నమ్మి మోసపోయామని కంటతడి పెడుతున్నారన్నారు. కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో హకులు సా ధించుకోవాలని, లక్షలాదిగా రజతోత్సవ సభకు రావాలని గండ్ర అన్నారు. సమావేశాల్లో మాజీ ఎంపీపీ కల్లెపు రఘుపతి, పార్టీ మండలాధ్యక్షుడు పిన్ రాజిరెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు మందల రవీందర్‌రెడ్డి, పీఎస్సీఎస్ మాజీ చైర్మన్ సాగర్‌రెడ్డి, భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, గుడాడుపల్లి మాజీ సర్పంచ్ ఉడుత ఐల య్య, సీనియర్ నాయకులు పింగిళి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
కాగా, ఎల్కతుర్తిలోని బీఆర్ఎస్ రజతోత్సవ సభా స్థలిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదివారం పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవారెడ్డి, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డితో కలిసి ఆయన సభా ప్రాంగణమంతా కలియదిరిగారు. అనంతరం భూపాలపల్లి నియోజకవర్గానికి కేటాయించిన పార్కింగ్ స్థలాలను నాయకులతో కలిసి పరిశీలించారు.
నయీంనగర్, ఏప్రిల్ 20 : ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని మాజీ చీఫ్ విప్, పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు.
ఆదివారం వడ్డేపల్లి బాలయ్య హోటల్ వద్ద జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బహిరంగ సభకు తరలివ చ్చి మళ్లీ బీఆర్ఎస్ అంటే ఏమిటో చూపించాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లోహిత రాజు, మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్‌భాస్కర్, స్వప్న, అరుణ, శ్రావణ్, చిన్న, మధు, చంద్రమౌళి, జైపాల్, సుదర్శన్, ప్రసంగి తదితరులు పాల్గొన్నారు.
నల్లబెల్లి, ఏప్రిల్ 20 : నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఉద్యమ స్ఫూర్తిని చాటాలని, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సమయం ఆసన్నమైందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని ఆయన నివాసంలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రజతోత్సవ సభకు బయలుదేరే ముందు గ్రామాల్లో గులాబీ జెండాలు ఆవిష్కరించాలని, అనంతరం ప్రజలతో కలిసి సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని సూచించారు.
ఇప్పటికే కేసీఆర్ సభ అంటేనే అధికార పార్టీల్లో అలజడి మొదలైందన్నారు. 420 హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కారు వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
కోట్లాది రూపాయలు ఢిల్లీకి చేర్చడమే పనిగా పెట్టుకున్న సీఎంకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సన్నద్ధం కావాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ గ్రామంలో ఎంతమంది సభకు వెళ్తున్నారనే సమాచారాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా కాంగ్రెస్ పార్టీ సమాచారం సేకరిస్తున్నదన్నారు.
అడ్డంకులు, అడ్డుగోడలను కూల్చుకుంటూ తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్న ప్రజలు భయమెరుగరని, చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, మాజీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు క్యాతం శ్రీనివాస్, గుగులోత్ సారయ్య, వీరస్వామి, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.