జయశంకర్ భూపాలపల్లి, జూలై 24 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం రానున్నది. ప్రాజెక్టులో భాగమైన అన్నారం, మేడిగడ్డ బరాజ్‌లను సందర్శించనున్నది. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి ప్రాజెక్టును బదనాం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని, రిపేరు చేసే వీలున్నా జాప్యం చేయడంపై బీఆర్ఎస్ ఎప్పటికప్పుడూ ఎండగడుతూనే ఉన్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుంగిన మేడిగడ్డ పిల్లర్ వద్దకు తరలివచ్చింది. సీఎం సహా మంత్రులు వచ్చి బరాజ్ వైఫల్యం అంటూ ఆరోపణలకు దిగారు.
ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మేడిగడ్డకు వెళ్లి ప్రాజెక్టుకు సంబంధించి నిజానిజాలు, కాంగ్రెస్ కుట్రలను ప్రజలకు వివరించారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని పూర్తిగా గేట్లు ఎత్తి కిందికి పంపడంతో రైతులు సాగునీటి కోసం పడిన ఇబ్బందులు ప్రాజెక్టు ఆవశ్యకతను గుర్తుచేశాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం అన్నారం, మేడిగడ్డ బరాజ్‌ల నుంచి పెద్ద ఎత్తున నీరు వృథాగా పోతుండడంతో బరాజ్‌ల నుంచి నీటిని పంపింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పంపింగ్ చేయకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కాళేశ్వరం బాట పడుతున్నది. ఈ నెల 26న ఉదయం ప్రత్యేక బస్సులో బయల్దేరి కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి మేడిగడ్డ బరాజ్‌కు చేరుకుని బరాజ్‌ను సందర్శించి ప్రాజెక్టు గురించి ప్రజలకు వివరిస్తారు.