‘బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మరోసారి నాకు వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తాను.’ అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా టికెట్ ఖరారైన నేపథ్యంలో ఆయన ‘నమస్తేతెలంగాణ’తో మాట్లాడారు. గడిచిన ఐదేళ్లలో ఇక్కడ రూ. 4వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజా సమస్యల పరిష్కరమే ఎజెండాగా ముందుకెళ్తున్నానని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల సహకారంతో మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం నియోజకవర్గంలో మరో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.
వరంగల్, ఆగస్టు 24 (నమస్తేతెలంగాణ): ‘వరంగల్ తూర్పు నియోజకవర్గం 90 శాతం నిరుపేదలు ఉండే ప్రాంతం. మిగతా పది శాతం కూడా మధ్య తరగతి వారే. 2014కు ముందు ఈ ప్రాంతం పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. ఎంతోమంది కార్మికులకు ఉపాధినిచ్చిన ఆజంజాహి మిల్లును అమ్మారు. తోళ్ల పరిశ్రమ అంతరించిపోయింది. బీడీ పరిశ్రమదీ అదే పరిస్థితి. ఇక ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ విభజనతో దీనిపై ఆధారపడిన కార్మికులకు జీవనోపాధి తగ్గింది. మౌలిక వసతులు కరువయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంతో వరంగల్ అభివృద్ధికి అడుగులు పడ్డాయి. ఆజంజాహి మిల్లు లేని లోటును పూడ్చేందుకు తెలంగాణ సర్కారు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును నిర్మిస్తున్నది. సెంట్రల్ జైలు స్థలంలో దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మిస్తున్నది. 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వంద ఫీట్ల రోడ్డు నిర్మించింది. ఇలా అనేక మౌలిక వసతులు కల్పించింది. నాపై నమ్మకంతో రెండోసారి తూర్పు టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతా. కేవలం ఐదేళ్లలోనే రూ. 4 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాం’ అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా బీఆర్ఎస్ అధిష్టానం తన పేరును ఖరారు చేయడంపై ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
నరేందర్: నేను లారీ డ్రైవర్ కొడుకును. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడిగా రెండుసార్లు, మేయర్‌గా ఒక టర్మ్ పని చేశా. ప్రస్తుతం ఎమ్మెల్యేగా పని చేస్తున్న. మరోసారి తూర్పు అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించడం అనేది సామాన్య విషయం కాదు. కేసీఆర్ దయాదాక్షిణ్యాలు, మంత్రి కేటీఆర్ ఆశీర్వాదం. ఒక కామన్ మెన్‌ను బీఆర్ఎస్ 90 శాతం నిరుపేదలు ఉన్న ప్రాంతంలో నిలబెట్టడం వల్ల వరంగల్ తూర్పు నియోజకవర్గం ఈ రోజు అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. మరోసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం లభించడంపై సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్‌కుమార్, జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, సహకరించిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు మెట్టు శ్రీనివాస్, బొల్లం సంపత్‌కుమార్, మౌలానా, కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. భవిష్యత్‌లో మీతోటే మీబాటే పయనిస్త. కచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టే దిశగా బ్లూ ప్రింట్‌ను అమలు చేస్తున్న.
నరేందర్: నేను నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్న. ప్రజలే ఎజెండాగా ముందుకు వెళ్తా. ఐదేళ్లుగా నియోజకవర్గంలోని దీర్ఘకాలిక సమస్యలెన్నో పరిష్కరిస్తూ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న. రూ. 1,200 కోట్లతో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ప్రజలకు అనేక రకాల సూపర్‌స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రూ. 273 కోట్లతో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దశబ్దాలుగా సమస్యల్లో ఒకటైన ఎస్ఆర్టీ, టీఆర్టీ కాలనీల క్రమబద్ధీకరణకు ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాంకీలో రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారానికి కృషి చేశా. ఈరోజు రిజిస్ట్రేషన్లు కూడా మొదలయ్యాయి. దళిత, గిరిజన కాలనీల మధ్య అజంజాహి మిల్స్ గ్రౌండ్ స్థలంలో అధునాతన హంగులతో కలెక్టరేట్ నిర్మాణం. దీనివల్ల 19, 27, 36, 33, 20 డివిజన్ల పరిధిలోని కాలనీల్లో వెలుగు వచ్చింది. ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. సబ్బండ జాతికి మేలు జరుగుతున్నది. ఇరవై ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వంద ఫీట్ల రోడ్డు నిర్మాణం రూ. 27 కోట్లతో పూర్తయిందది. రూ. 77.50 కోట్లతో 2.15 ఎకరాల్లో మోడల్ బస్‌స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ. 110 కోట్లతో 2,213 డబుల్ బెడ్రూం ఇండ్లు, రూ. 28 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణం. రూ. 16 కోట్లతో ఉర్సుబండ్ అభివృద్ధి పనులు. ఇలా చెప్పుకుంటూపోతే నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. ఇవి కనపడుతున్నాయి. జరిగిన ఈ అభివృద్ధిని ప్రజలకు వివరిస్తా. అందరి సహకారంతో మళ్లీ అద్భుతమైన విజయం సాధిస్తా.
నరేందర్: కాంగ్రెస్ పాలనలో ఆజంజాహి మిల్‌ను అమ్మినందున ఇక్కడి కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉదేశంతో సీఎం కేసీఆర్ 12 కి.మీ. దూరంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణం చేపట్టారు. 1,200 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కు నిర్మాణం జరుగుతున్నది. ప్రభుత్వ పాలసీ ఆకర్షణీయంగా ఉండడంతో పెద్దపెద్ద కంపెనీలు మెగా పార్కులో వస్త్ర పరిశ్రమలను స్థాపిస్తున్నాయి. వరంగల్‌తూర్పు నియోజకవర్గంలోని సుమారు పది వేల మంది మహిళలకు ఈ పార్కులో ఉద్యోగం లభించనుంది. మహిళలకు శిక్షణ కూడా ఇప్పిస్తాం. వచ్చే టర్మ్‌లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం. కార్మికులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నా.
నరేందర్: ఇప్పటికే నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇండ్ల స్థలాలకు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నది. వరంగల్‌తూర్పు నియోజకవర్గంలో జీవో 58, 59 ద్వారా త్వరలో 3,200 మంది పేదలకు పట్టాలను పంపిణీ చేయనున్నాం. సొంత జాగ ఉన్న పేదలు ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం గృహలక్ష్మీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా నియోజకవర్గంలో మూడు వేల ఇండ్లను మంజూరు చేయనున్నాం. ఒక్కో ఇంటికి రూ. 3 లక్షలను ప్రభు త్వం ఇవ్వనుంది. దళితబంధు పథకం ద్వారా తొలివిడుత నియోజకవర్గంలో 100 మంది దళితులకు యూనిట్లను అందజేశాం. రెండో విడుత మరో 1,100 మంది దళితులకు ఈ పథకం ద్వారా యూనిట్లను అందజేయడానికి కసరత్తు జరుగుతున్నది. నియోజకవర్గంలోని దళిత కాలనీల్లో రహదారుల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సరఫరా తదితర అభివృద్ధి పనులు చేపట్టాం.