వరంగల్, అక్టోబర్15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) /వరంగల్, (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి మేనిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఆదాయం పెంచాలి… పేదలకు పంచాలనే విధానంతో తొమ్మిదన్నరేండ్లుగా పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. మన నిధులు మనకే అనే నినాదాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూ రాష్ట్రంలోని ప్రతి ఊరును, బస్తీని సమగ్రంగా అభివృద్ధి చేసింది. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధికి కొనసాగింపుగా సంక్షేమ పథకాలను మరింత విస్తృతం చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. దీన్ని ముఖ్యంగా పేదలు, మహిళలు పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తామనడం, తెల్లకార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా అమలు చేస్తామనడంపై పేద వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
వృద్ధాప్య, దివ్యాంగ పెన్షన్లు పెంచడం, రైతు బంధు కింద పెట్టుబడి సాయాన్ని పెంచుతామని పేర్కొనడంపై ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అర్హులైన మహిళలకు ప్రతి నెల రూ.3 వేల చొప్పున భృతి, పేద మహిళలకు రూ.400కు గ్యాస్ సిలిండర్, మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు నిర్మించనున్నట్లు మేనిఫెస్టోలో పేర్కొనడంపై నారీలోకం వేనోళ్ల పొగుడుతున్నది. ఆరోగ్యశ్రీ కింద వైద్యం కోసం అందించే మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచడం, అగ్రవర్ణాల్లోని పేద పిల్లల చదువుల కోసం నియోజకవర్గానికో గురుకులాన్ని నెలకొల్పడం, ఉద్యోగుల సీపీఎస్‌పై అధ్యయన కమిటీని నియమించనున్నట్లు తెలపడంతో హర్షం వ్యక్తమవుతున్నది. అన్ని వర్గాలకు మరింత తోడ్పాటు అందించేలా ఉండడంతో సర్వత్రా చర్చ జరుగుతున్నది. మేనిఫెస్టోపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు నిర్వహించారు. ప్రధాన కూడళ్ల వద్ద పటాకులు కాల్చారు. డప్పు చప్పుళ్లతో ర్యాలీలు తీశారు. ఊరూరా, వాడవాడనా బీఆర్ఎస్కు అనుకూలంగా నినాదాలు చేశారు.