BRS Party | వరంగల్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించడంతో పాటు బీ(టీ)ఆర్ఎస్కు ఆవిర్భావం నుంచి అండగా నిలుస్తున్న చారిత్రక ఓరుగల్లు మరో బృహత్తర కార్యక్రమానికి వేదిక కాబోతున్నది. వరంగల్ గడ్డపై అక్టోబర్ 10న బీఆర్ఎస్ మహాసభ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈమేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటన చేయగా టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత ఇది తొలి బహిరంగ సభ కావడంతో భారీ జనసమీకరణతో ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఉద్యమనేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇక్కడ జరిగిన ప్రతి సభకు జనం బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించారు. ఇందులో భాగంగా త్వరలో ఉమ్మడి జిల్లా కీలక నేతలతో సమావేశం నిర్వహించనుండగా శ్రేణుల్లో జోష్ మొదలైంది.
చారిత్రక వరంగల్ మరోసారి గులాబీ జెండా కీలక కార్యక్రమానికి వేదిక అవుతున్నది. తెలంగాణ ఉద్యమంలో, కొత్త రాష్ట్రంలో టీఆర్ఎస్ ముఖ్యమైన కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న వరంగల్‌లో బీఆర్ఎస్ మొదటి మహాసభ జరుగనున్నది. అక్టోబర్ 10న బీఆర్ఎస్ మహాసభను వరంగల్‌లో నిర్వహించనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ప్రకటించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత జరుగుతున్న మొదటి మహాసభ కావడంతో దీన్ని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ నిర్ణయించింది. త్వరలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కీలక నేతలతో దీనిపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు.
వరంగల్ మొదటినుంచీ టీఆర్ఎస్కు, ఇప్పుడు బీఆర్ఎస్కు కీలక కేంద్రంగా ఉంటున్నది. ఉద్యమ కార్యక్రమాలతో పాటు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు వరంగల్ ఉమ్మడి జిల్లా అండగా నిలుస్తున్నది. తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ అమలుచేసిన ముఖ్యమైన వ్యూహాలు వరంగల్ వేదికగానే జరిగాయి. రాష్ట్ర ఏర్పాటుతో పాటు సొంత రాష్ట్రంలో పరిపాలన నిర్ణయాలు వరంగల్ నుంచే మొదలయ్యాయి. కల్యాణలక్ష్మి, డబుల్ బెడ్రూం పథకాల అమలుకు.. గుడుంబా నివారణ వంటి ఎన్నో కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ వరంగల్ ఉమ్మడి జిల్లా వేదిక అయ్యింది. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత 2001 జూన్ 21న కాకతీయ డిగ్రీ కాలేజీలో మొదటిసారి బహిరంగ సభ జరిగింది. భారీ సంఖ్యలో జనం ఈ సభకు వచ్చారు. అప్పటినుంచి టీఆర్ఎస్ ప్రతి కార్యక్రమం వరంగల్ నుంచే జరుగుతున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ మహాసభ ఇక్కడే జరుగనున్నది.
️⛳️ 2001 జూన్ 21 కాకతీయ డిగ్రీ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ.
️⛳️ 2002 ఏప్రిల్ 21న వరంగల్ జిల్లాలోని బస్వా తండాను కేసీఆర్ సందర్శించారు. అగ్నిప్రమాదంలో ఇల్లు కాలిపోయిన కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సాయం ప్రకటించారు.
️⛳️ 2002 అక్టోబర్ 28న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భూపాలపల్లిలో బహిరంగ సభ.
️⛳️ 2003 ఏప్రిల్ 26న సిద్దిపేట నుంచి వరంగల్ వరకు 100 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ.
️⛳️ ఏప్రిల్ 27న వరంగల్ జైత్రయాత్ర పేరిట భారీ బహిరంగ సభ. మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవగౌడ, అప్పటి వ్యవసాయ మంత్రి అజిత్‌సింగ్ హాజరు.
️⛳️ 2003 అక్టోబర్ 22న టీఆర్ఎస్ ప్రతిష్టాత్మక కార్యక్రమం పల్లెబాటను మేడారంలో కేసీఆర్ ప్రారంభించారు.
️⛳️ 2003 డిసెంబర్ 5న జనగామలో ఓరుగల్లు వీరగర్జన బహిరంగసభ.
️⛳️ 2004 సాధారణ ఎన్నికల్లో వరంగల్, హనుమకొండ లోక్‌సభ స్థానాలు.. హనుమకొండ, స్టేషన్‌ఘన్‌పూర్, చేర్యాల, నర్సంపేట, పరకాల, చెన్నూరు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం.
⛳️ 2005 జూలై 17 వరంగల్‌లో భారీ బహిరంగ సభ. అప్పటి కేంద్ర మంత్రి శరద్‌పవార్ హాజరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆరుగురు టీఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేసిన తర్వాత నిర్వహించిన మొదటి సభ ఇదే.
⛳️ 2007 ఏప్రిల్ 27 తెలంగాణ విశ్వరూప మహాసభ పేరుతో టీఆర్ఎస్ ఆరో వార్షికోత్సవం.
⛳️ 2007లో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం.
⛳️ 2008 ఫిబ్రవరి 16న కేసీఆర్ మేడారం సందర్శన. వనదేవతలకు మొక్కులు.
⛳️ 2008 జూన్ 1న ఉప ఎన్నికల ఫలితాలు. హనుమకొండ లోక్‌సభ, చేర్యాల స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు.
⛳️ 2009 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు.
⛳️ 2009 నవంబర్ 23న కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల జేఏసీ బహిరంగ సభ. 14 విద్యార్థి సంఘాలతో సమావేశం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ‘కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో నినాదం’ ప్రకటన.
⛳️ 2010 ఫిబ్రవరి 7న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.
⛳️ 2010 సెప్టెంబర్ 3న పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో టీఆర్ఎస్ బహిరంగ సభ.
⛳️ 2010 డిసెంబర్ 16న తెలంగాణ మహాగర్జన పేరుతో నగరంలోని ప్రకాశ్‌రెడ్డిపేటలో భారీ బహిరంగ సభ.
⛳️ ఆర్య సమాజ్ అధ్యక్షుడు స్వామి అగ్నివేశ్ ముఖ్య అతిథిగా హాజరు. ఉద్యమ చరిత్రలోనే అతిపెద్ద బహిరంగ సభగా రికార్డు.
⛳️ 2012లో స్టేషన్ ఘన్పూర్ ఉపఎన్నిక ప్రచారంలో కేసీఆర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.
⛳️ 2012 మే 2 నుంచి 7 వరకు పరకాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పల్లెబాట కార్యక్రమం నిర్వహణ.
⛳️ 2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ.. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం.
⛳️ 2015 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం.
⛳️ 2015 నవంబర్ 24న వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాలు. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల రికార్డు మెజారిటీతో ఘన విజయం.
⛳️ 2015 డిసెంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక.
⛳️ 2016 మార్చిన 9న గ్రేటర్ వరంగల్ ఎన్నికల ఫలితాలు. 58 డివిజన్లలో 44 స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్.
⛳️ 2017 ఏప్రిల్ 27న నగరంలోని ప్రకాశ్‌రెడ్డిపేటలో ప్రగతి నివేదిన పేరుతో భారీ బహిరంగ సభ.
⛳️ 2018 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లోని 11 స్థానాల్లో ఘన విజయం.
⛳️ 2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ స్థానాల్లో విజయం.
⛳️ 2019 మేలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ఆరు జడ్పీలు, 98శాతం ఎంపీపీల్లో గెలుపు.
⛳️ 2019 జూన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఘన విజయం.
⛳️ 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 9 మున్సిపాలిటీల్లో గెలుపు.
⛳️ 2021 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు.
⛳️ 2021 ఏప్రిల్-మేలో జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ ఆధిక్యతతో గెలిచింది.