వరంగల్, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఓరుగల్లు పోరుఖిల్లా బీఆర్ఎస్కు వీరతిలకం దిద్దింది. రైతు‘రణ’కెరటమై హోరెత్తింది. మునుముందుకు సాగండని దీవెనార్థి పెట్టింది. రైతు ‘సంగ్రామ’ సదస్సు నేపథ్యంగా మరోసారి ఉద్యమించమని బీఆర్ఎస్ పార్టీకి సందేశాన్ని ఇచ్చింది. ఆగమైపోతున్న రైతన్న బతుకులు బాగుపడేదాకా కొట్లాట చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఉపదేశం ఇచ్చింది. ‘ఓరుగల్లుకు వందనం… పోరుగల్లుకు వందనం.. కాకతీయ పౌరుషానికి వందనం.. కాకతీయ పౌరుషాల గడ్డ ఇది.. తెలంగాణ ఆత్మగౌరవ అడ్డా ఇది.. జయశంకర్ సార్ పుట్టినగడ్డ ఇది’ అంటూ కేటీఆర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టి, ప్రజాకవి కాళోజీ ప్రవచించిన ‘మరచిపోకుండగ గురుతుంచుకోవాలె..
కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలె.. కాలంబు రాగానే కాటేసీ తీరాలె’ అనే కవితా పాదాలను పఠిస్తున్నప్పుడు రైతు సంగ్రామ సదస్సు ప్రాంగణం పులకించిపోయింది. ఉద్యమకాలంలో హనుమకొండ, వరంగల్ పురవీధుల్లో తాను సైతం కాగాడా పట్టుకొని ఉద్యమ కవాతు చేశానని చెప్పిన సందర్భాన్ని, వరంగల్ జైల్లో రెండు రోజులున్న కాలాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు ఉద్విగ్నమైపోయింది. మరోవైపు తెలంగాణ జైత్రయాత్ర నుంచి మహాగర్జన దాకా, గత ఏడాది నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభ నుంచి రైతు సంగ్రామ సదస్సు దాకా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ మలుపుతిరిగే నిర్ణయం తీసుకున్నా అది వరంగల్ నుంచే అని కేటీఆర్ గుర్తు చేస్తున్నప్పుడూ సభా ప్రాంగణం ‘జై తెలంగాణ’ నినాదాలతో మారుమోగింది.

సరిగ్గా నాలుగేండ్ల (2022, మే 6) క్రితం వరంగల్ డిక్లరేషన్ పేరుతో రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ మోసం, సీఎం రేవంత్‌రెడ్డి దగాపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్‌కు పాతరేసిందని మండిపడ్డారు. అధికారంతో ఊరేగుతున్నదని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్న అవస్థలు చూస్తే తెలిసిపోతుందని ఆయన రైతు సమస్యలను ఏకరువుపెట్టారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతాంగాన్ని ఆయన క్షేత్రస్థాయిలో కలుసుకొని వారి సమస్యలు విన్నారు. బుధవారం రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తూర్పారబట్టారు.
సుబేదారి, మే 6 : బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సుకు కాంగ్రెస్ సర్కార్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి బుధవారం పెద్ద ఎత్తున తరలివస్తున్న అన్నదాతలను రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రాంగణానికి కిలోమీటర్ దూరంలోనే నిలిపివేయించింది. రైతులు మండుటెండను సైతం లెక్కచేయకుండా వాహనాలు దిగి కాలినడకన సదస్సుకు హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరించినా గ్రామాల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చిన అన్నదాతలు సదస్సును విజయవంతం చేయడంతో బీఆర్ఎస్ వర్గాలు హర్షం ప్రకటించాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు రోజుల పర్యటన గులాబీ శ్రేణుల్లో జోష్ నింపింది. లీడర్ నుంచి కేడర్ దాకా అందరి మొహాల్లో సంతోషం తొణకిసలాడింది. మరోవైపు కేటీఆర్ గతంలో కన్నా భిన్నంగా ఈ సారి టూర్లో మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకొని అమలు చేశారని, ఆ అనూహ్య నిర్ణయాల అమలు పార్టీ శ్రేణులను సంతృప్తి పరచిందనే అభిప్రాయాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ పర్యటన ఆసాంతం రైతును కేంద్రంగా చేసుకొని సాగినా, వీలు చేసుకొని వివిధ వర్గాలను ప్రత్యేకించి ఉద్యమకాలం నుంచి సేవలందించిన వారిని కలుసుకొని పలకరించిన తీరుపై పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు గత పర్యటనలతో పోలిస్తే కేటీఆర్ ఈసారి చాలామంది ముఖ్యనాయకుల దగ్గరికి వెళ్లి పలకరించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంట్లో బస, అంతకుముందు పార్టీ నాయకుడు కేశవరావు ఇంటికి వెళ్లి పరామర్శ, పార్టీ సీనియర్ నేత ఎల్లావుల లలితాయాదవ్ ఇంటికి వెళ్లి ఆమె కుమారుడికి అభినందన, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, ప్రముఖ న్యాయవాది ముద్దసాని సహోదర్‌రెడ్డి ఇళ్లకు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇంట్లో లంచ్, పార్టీ నాయకుడి కుమారుడి వివాహానికి హాజరు, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లి వారి ఆశీస్సులు తీసుకోవడం వంటి ఎడతెరపిలేని కార్యక్రమాలు తప్పకుండా పార్టీకి మేలు చేయడమే కాకుండా కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కేటీఆర్ అంటే యూత్‌లో ఎంత క్రేజ్ ఉన్నదో మరోసారి తేలిపోయింది. ఆయన పర్యటనలో వందల మంది యువకులు కేటీఆర్‌తో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. మొత్తానికి ఎర్రటి ఎండలో సైతం విరగపూసిన గులాబీవనంలా ఉమ్మడి వరంగల్‌లో కేటీఆర్ పర్యటన సూపర్‌హిట్ అయింది.

న్యూ శాయంపేట : ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సరైన వసతులు లేవు. గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులకు నష్టానికి అమ్ముకుంటున్నరు. వాతావరణంలో వస్తున్న మార్పులతో ఆందోళన చెందుతున్న రైతులు.. ధాన్యాన్ని తకువ ధరకు అమ్ముకుంటున్నారు. ప్రైవేట్ వ్యాపారులు, రైస్మిల్లర ్లయజమానులు కల్లాల వద్దకు వచ్చి తేమ, నాణ్యత పేరుతో రైతులను నిట్టనిలువునా దోసుకుంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మమ్ములను ఎక్కడా ఇబ్బందిపడనీయలే. టైము కొనుగోలు కేంద్రాలు పెట్టి గింజ వదలకుండా కొన్నడు. వెంటవెంటనే డబ్బులు కూడా ఇచ్చిండు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్ములను ముంచుతున్నది.
– యుగేంధర్ ఏనుగల్లు, వర్ధన్నపేట నియోజకవర్గం
హనుమకొండ : వరంగల్‌లో రైతు సంగ్రామ సదస్సు పెట్టడం మా అదృష్టం. వరంగల్ రైతు డిక్లరేషన్ అమలును కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి దిగి వచ్చే వరకు రైతులు పోరాటాలకు సిద్ధం కావాలి. ఆనాడు నీళ్లు, కరెంటుకు రైతు లు ఇబ్బందులు పడేవారు. కేసీఆర్ హయాంలో కల్లాల దగ్గరకు వచ్చి మక్కలు, వరి, తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పుడు కాంటాలు వేసేందుకు ఎంత ఇస్తావని అడుగుతున్నారు. అలాగే ట్రాన్స్‌పోర్టుకు రూ. 100 వసూలు చేస్తున్నారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రైతు మేళా నిర్వహించడం కాదు. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో పెడితే అన్నదాతలు ఉరికించి కొడతారు. దమ్ముంటే మార్కెట్‌కు రావాలి. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు. ఉన్నాడంటే ముక్కు నేలకు రాస్తా. మక్కలు, వడ్ల కొనుగోలు విషయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దిగిరాకపోతే మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి దుమ్ములేపుతాడు. కేసీఆర్, కేటీఆర్ ఇచ్చే ఏ పిలుపుకైనా మేము సిద్ధంగా ఉన్నాం.
– మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వానిది రాబందుల పాలన. రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ సర్కార్ పండిన పంటను పావలా వంతు కూడా కొనుగోలు చేయలేదు.కల్లాలు, కేంద్రాల వద్ద రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు. రైతుల కన్నీళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. రైతులు సంతోషంగా ఉండాలంటే రాబందుల పాలన పోయి రైతు బంధు పాలన రావాలి. రైతు బిడ్డగా కేసీఆర్ రైతులు వారి కాళ్లపై వారు నిలబడేలా చేశాడు. ఆయన పాలన ఒక స్వర్ణయుగం. మండుటెండను సైతం లెక్క చేయకుండా రైతులు సదస్సుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చినందుకు ధన్యవాదాలు.
-సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి
బీఆర్ఎస్ సభలు పెడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వణికిపోతున్నది. మేము రైతు సంగ్రామ సదస్సు పెడితే కాంగ్రెస్ మెగా రైతు మేళా పెట్టింది. కేసీఆర్ జగిత్యాలలో మీటింగ్ పెట్టగానే అదే రోజు రేవంత్‌రెడ్డి సభ పెట్టారు. అక్కడ ఒక ఎకరానికి రూ. 6 వేలు ఇస్తే మంత్రి తుమ్మల అలాయ్ బలాయ్ తీసుకున్నడు. ఆయనకేమైనా సిగ్గు, శరం ఉందా? 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ 70 లక్షల మంది రైతులకు 11 విడతల్లో రూ. 72 వేల కోట్లు నేరుగా ఖాతాల్లో జమచేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో దేవాదుల నీళ్లు కేవలం 47 వేల ఎకరాలకు మాత్రమే ఇస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 3.47 లక్షల ఎకరాలకు సాగునీరందించింది. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక ఎకరానికి కూడా అదనంగా నీళ్లివ్వలేదు. తట్టెడు మట్టి తీయలేదు. జానెడు కాలువ తవ్వలేదు. కాకతీయుల స్ఫూర్తిగా పోరాటం చేస్తాం. రాణి రుద్రమదేవి పౌరుషం, సమ్మక సారలమ్మ పోరాట స్ఫూర్తిగా, ఈ గడ్డ మట్టి మాణిక్యాలు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, సర్దార్ పాపన్నల స్ఫూర్తితో, మా జయశంకర్ సర్, కాళోజీ సాక్షిగా కొట్లాడుతాం. మీ మెడలు వంచుతాం. మా రైతన్నలకు ఇచ్చిన హామీలు సాధిస్తాం. రైతులు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో హాజరైన సదస్సు ఇదే.
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే
న్యూ శాయంపేట : రైతుల పాలిట కేసీఆర్ దేవుడు. ఆయన పాలనలో అన్ని విధాలా సంతోషంగా ఉన్నాం. ఏ ఆపద రాకుండా దేవుడిలా కాపాడిండు. ఉచిత కరెంటు, రైతుబంధు, సాగునీళ్లు ఇచ్చిం డు. రైతుల గురించి కేసీఆర్‌కు తెలిసినంత ఈ దేశంల ఎవరికీ తెల్వదు. అన్నీ టైముకు చేసిండు. కేసీఆర్‌ను ఎన్నికల్లో ఓడగొట్టుకొని చానా తప్పుజేసినం. ఇప్పుడు కష్టపడుతానం.
-సూరయ్య, కాట్రపల్లి, మహబుబాబాద్
కష్టపడి పండించిన పంటను కొనకుండా సీఎం రేవంత్‌రెడ్డి గోస పెడుతుండు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఎన్న డూ ఇంత గోస పడలేదు. కాంగ్రెసోళ్లు అన్ని దొంగ మాటలు మాట్లాడుతున్నరు. నమ్మి ఓట్లేస్తే నిండాముంచిండ్రు. కేసీఆర్ పాలనల గిట్ల లేకుండే. జేత్తనన్నవన్నీ జేసిండు. కష్టం రాకుండా చూసుకున్నడు. కంటినిండా నిద్రపోయినం.
-ధరావత్ రామోజీ, హుస్నాబాద్
గత ఎన్నికల్లో కేసీఆర్ సార్‌ను ఓడ గొట్టుకొని నరకం చూ స్తున్నం. రేవంత్‌రెడ్డి రైతుల పాలిట యముడిగా మారిండు. పండించిన పంట కొనకుండా గోస పెడుతున్నడు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ ఒక గింజ వదలకుండా వడ్లు మొత్తం కొన్నడు. రైతులను కడుపుల పెట్టి చూసుకున్నడు.
-ఏశబోయిన పురుషోత్తం నర్సంపేట
ఆకాశంలో మబ్బులు వస్తే భయం పుడుతుంది. ఎండనకా, వాననకా కష్టపడి పండించిన పంటను కొనడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుంది. ఇప్పటికే ఓ మారు వర్షం పడితే నానా కష్టాలు పడి తడిచిన వడ్లను ఎండలో ఆరబోసుకున్నాం. మళ్లీ వర్షం వస్తే తీవ్రంగా నష్టపోతం. ప్రభుత్వం కొనుగోళ్లను స్పీడ్ చేయాలి. లేకపోతే నష్టపోతం.
-కొనుగాటి ప్రశాంత్, కొత్తగూడ, నియోజకవర్గం నర్సంపేట