ఎమ్మెల్సీ కవితపై నోరుపారేసుకున్న బండి సంజయ్‌పై మహిళా లోకం భగ్గుమన్నది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, సంజయ్ దిష్టిబొమ్మల దహనాలతో హోరెత్తించింది. శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా, మండలకేంద్రాల్లో ఆందోళనకు దిగిన మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు..‘బండి’ ఫ్లెక్సీలను చెప్పులతో కొడుతూ దిష్టిబొమ్మలను శవయాత్రగా ఊరేగించి ఆగ్రహంతో తగులబెట్టారు. మహిళల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నించి.. నోరు అదుపులో పెట్టుకోవాలని బండిని హెచ్చరించడంతో పాటు వెంటనే కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే సంజయ్‌ని వెంటనే సస్పెండ్ చేయాలని నినదించి, అరెస్ట్ చేయాలంటూ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
– నమస్తే తెలంగాణ, నెట్వర్క్
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా, మండలకేంద్రాల్లో రాస్తారోకోలు చేసి బండి దిష్టిబొమ్మలను ఊరేగించి కూడళ్ల వద్ద దహనం చేశారు. అలాగే మహిళా నాయకులు ఆగ్రహంతో చెప్పులతో కొట్టి నోటిని అదుపులో పెట్టుకోవాలంటూ ఫ్లెక్సీకి బొగ్గు రాస్తూ నిరసన తెలిపారు. హనుమకొండ జిల్లా కాజీపేట చౌరస్తాలో గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్‌తో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ రాస్తారోకోలో పాల్గొని బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బండి సంజయ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని.. బీజీపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
పరకాలలోనూ నిరసనలు హోరెత్తాయి. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జనగామలో జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రేణులు రాస్తారోకో చేసి దిష్టిబొమ్మను తగులబెట్టారు. మానుకోటలో ‘బండి’ నిరసనలో మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్ పాల్గొనగా మహిళా నాయకులు బండి సంజయ్ ఫ్లెక్సీని ఊరేగించి చెప్పులతో కొట్టారు. మరిపెడలో సాయంత్రం వేళ పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు నిరసనలో పాల్గొన్నారు. అలాగే తొర్రూరులో ఆందోళనలు కొనసాగాయి. మహిళా లోకానికి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాకేంద్రంతో పాటు వర్ధన్నపేట, సంగెం, పర్వతగిరి మండలాల్లో నిరసనలు హోరెత్తాయి. – నమస్తే తెలంగాణ నెట్వర్క్