‘దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతులకు సంకెళ్లు వేస్తారా? జైలులో నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? లగచర్ల గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి.. అన్నదాతలను బేషరతుగా విడుదల చేయాలి’ అంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల తన మొండి వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి దురహంకారం, దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో గిరిజనులు, బహుజనులపై అరాచకాలు, బెదిరింపులు పెరిగిపోయాయని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు వినతి పత్రాలు సమర్పించారు.
-నమస్తే నెట్వర్క్, డిసెంబర్ 17
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వినతిప త్రం ఇచ్చారు. లగచర్ల గిరిజనులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. హనుమకొండ అంబేద్కర్ సెంటర్లోని విగ్రహానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఇతర నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని, అన్నదాతలను కాంగ్రెస్ సర్కారు నిలువునా ముంచుతున్నదన్నారు. కాశీబుగ్గ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వరంగల్ తూ ర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శ్రే ణులతో కలిసి వినతిపత్రం సమర్పించారు.
రైతుల జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టేందుకు వారు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వమన్న రైతులను సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, వాళ్లేమైనా కరుడుగట్టిన తీవ్రవాదులా? బేడీలెలా వేస్తావంటూ మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తున్నదని విమర్శించారు.