‘బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటల కరంటు ఇచ్చి రైతుల కష్టాలు పోగొడితే.. రేవంత్‌రెడ్డికి కండ్లు మండుతున్నయ్.. అందుకే వ్యవసాయానికి మూడు గంటల కరంటు చాలు అంటున్నడు.. ఇలాంటి ఓర్వలేని మాటలు మాట్లాడితే వాతలు పెడుతం’ అని రైతులు, బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఉచిత కరంటుపై టీపీసీసీ చీఫ్ ప్రేలాపనలను నిరసిస్తూ రెండో రోజు బుధవారం సైతం ఆందోళనలను కొనసాగించారు. రేవంత్ దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టి ఊరేగించి కూడళ్లలో దహనం చేశారు. ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. హనుమకొండ జిల్లాలోని హసన్‌పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట సెంటర్లో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండలం వేపచెట్టుతండాలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, కరీమాబాద్ ఆర్టీఏ జంక్షన్లో జరిగిన నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరై రేవంత్ తీరును ఎండగట్టారు. ఉచిత కరంటును ఎత్తేసేందుకు ఇప్పటినుంచే కుట్ర పన్నుతున్నారని, మళ్లీ కాంగ్రెసోళ్లు అధికారంలోకొస్తే పొలాల్లో పల్లేర్లే మొలిపిస్తారని మండిపడ్డారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 12
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 12 : రైతులు బాగుపడుతుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓర్వలేక కండ్లళ్ల నిప్పులు పోసుకుంటున్నాడని, అందుకే వ్యవసాయానికి ఉచిత కరంటు ఎందుకు? మూడు గంటలు చాలు అని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని రైతులు, బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. రేవంత్ తీరును నిరసిస్తూ బుధవారం సైతం ఆందోళనలను కొనసాగించారు. ఉమ్మడి జిల్లా అంతటా రేవంత్ దిష్టిబొమ్మలను చెప్పులకొడుతూ ర్యాలీలు తీసి కూడళ్లలో దహనం చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట సెంటర్లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, ధర్మసాగర్, వేలేరు మండల కేంద్రాల్లో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండల కేంద్రంల్లో హనుమకొండ జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్‌కుమార్ పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం వేపచెట్టుతండాలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కరీమాబాద్ ఆర్టీఏ జంక్షన్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జంక్షన్‌ను మానవహారంతో దిగ్బంధించి రాస్తారోకో చేశారు. జనగామ జిల్లాలో వరంగల్-హైదరాబాద్ హైవేపై, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్‌లో నిర్వహించిన ధర్నాల్లో ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. జనగామ, పాలకుర్తి, కొడకండ్ల, నర్మెట, బచ్చన్నపేట, తరిగొప్పుల మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
మహబూబాబాద్ జిల్లాలో ప్రధాన రహదారులు, మండల కేంద్రాల్లో రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. గూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ పాల్గొని రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మరిపెడలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ర్యాలీ తీశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్‌పాకలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దహనం చేశారు. ‘కాంగ్రెస్ డౌన్‌డౌన్.. రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై పార్టీ మండలాధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి ములుగు జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి హాజరై బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా, రాస్తారోకో చేశారు.