జనగామ, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన మాదిరిగానే ప్రజలిచ్చిన తీర్పుతో ప్రతిపక్ష పాత్రను పోషిస్తానని బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం పెంబర్తి ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్లు ప్రజల కోసం పాలేరునై పనిచేస్తానని.. నియోజకవర్గ ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి వారికి అండగా నిలిస్తానని పేర్కొన్నారు. తన గెలుపు కోసం 45 రోజులపాటు నాయకులు, కార్యకర్తలంతా ఐక్యంగా పని చేసిన ఫలితంగానే జనగామలో బీఆర్ఎస్ గెలిచిందన్నారు. రాత్రనక, పగలక పార్టీ కోసం పని చేసిన శ్రేణులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, ఇదే స్ఫూర్తితో పనిచేద్దాం అని అన్నారు. గ్రామాలు, పట్టణ వార్డుల్లో ఇంటింటికీ తీసుకువెళ్లి తనను పరిచయం చేసి ఒక్కో నాయకుడు తానే అభ్యర్థి పల్లాగా భావించి కష్టపడ్డారని అన్నారు.
ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టాలని, దాడులు, దౌర్జన్యం, గూండాయిజం, రౌడీయిజంతో బెదిరించాలని చూసినా విచక్షణతో ఓటేశారని, అందుకే జనగామలో గెలుపు సాధ్యమైందని, నా విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలు మాత్రం కాలికి బలపం కట్టుకొని పార్టీ కోసం పని చేశారని, వారు నా పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ప్రజలు కూడా నాపైన నమ్మకం పెట్టుకొని గెలిపించిన మేరకు చెప్పిన పనులను చేసేందుకు తనవంతు ప్రయత్నం ఉంటుందన్నారు. నన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు, ఇతర జిల్లాల నుంచి మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు కృతఘ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అనేక కుట్రలు చేసి నా గెలుపును అడ్డుకునే ప్రయత్నం చేసినా నిర్భయంగా ఆలోచించి ఓటేసి నా గెలుపులో ప్రజల గెలుపు ఉంటుందని, ఓటర్లకు శిరస్సు వంచి నమసారిస్తున్న అని రాజేశ్వర్రెడ్డి అన్నారు.
ఇకపై జనగామ జిల్లా కేంద్రంగా నా స్థిర నివాసం ఉంటుందని, ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తానని పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. మంచిని ఎవ్వరి వద్దా నుంచి అయినా నేర్చుకుంటా..చిన్న పెద్ద తేడా అనేది నాకు లేదని..ఇక నుంచి నీలిమ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ద్వారా జనగామ నియోజకవర్గ ప్రజలకు ఎంత ఖర్చైనా సరే ఉచిత వైద్య సేవలందించే బాధ్యత నాది అని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం ఒకవైపు ఉంటే జనగామ మరోవైపు నిలబడ్డదని..తెలంగాణ సాయుధ పోరాటం సహా నక్సలైట్ పోరాటం..ప్రత్యేక రాష్ట్ర సాధన తొలి, మలిదశ పోరాటంలో ముందున్నదని అన్నారు. చైతన్యవంతమైన జనగామ గడ్డ ప్రజలు నన్ను ఏ పాత్ర పోషించమని ఏ తీర్పు ఇచ్చారో దానికి కట్టుబడి వారి సేవ కోసం పనిచేస్తానని అన్నారు. నా విజయం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే ఘన విజయమని.. ఏ నమ్మకంతో అయితే గెలిపించారో అందరికీ పాదాభివందనం చేస్తున్నా అని పల్లా రాజేశ్వర్ రెడ్డి