రైతుభరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించింది. అన్ని మండల కేంద్రాల్లో అన్నదాతలతోపాటు గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలతో పాటు రాష్ట్ర సర్కారు, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. యాసంగిలో పెట్టుబడి పైసలు ఇవ్వకపోగా, కనీసం వానకాలమైనా ఇస్తారనుకున్న రైతన్నల ఆశలపై నీళ్లు చల్లుతూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతు భరోసా ఇవ్వలేమంటూ చేతులెత్తేయడంపై అన్నదాతలు, బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు.
గత ప్రభుత్వం రెండు పంటలకు ఎకరాకు రూ.10వేలు పెట్టుబడి సాయం అందించగా, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15వేలు ఇస్తామని చెప్పి మోసం చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీలిచ్చి ఇప్పుడు చేతులెత్తేయడంపై ఆరు జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేదర్ సెంటర్లో గులాబీ పార్టీ నాయకులు రాస్తారో కో చేశారు. కాజీపేట చౌరస్తాలో రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. ఫ్లకార్డులు చేతబూని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హుస్నాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే వొడి తెల సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో నిరసన వెలి బుచ్చారు.
జనగామ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలకు నిప్పుపెట్టారు. మహబూబాబాద్‌లోని ఎమ్మార్వో సెంటర్లో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. నెల్లికుదురులో రాస్తారోకో నిర్వహించగా శంకర్‌నాయక్ పాల్గొన్నారు. డోర్నకల్ ముత్యాలమ్మ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ పాల్గొని కాంగ్రె స్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ములుగులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశాయి. ఖిలా వరంగల్‌లోని పడమర కోటలోని అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.