వరంగల్- ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రచారం జోరందుకోగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. రేపు(బుధవారం) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ తూర్పు, పశ్చిమ, నర్సంపేటలో నిర్వహించే సమావేశాలకు హాజరై ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి విజయం చేకూర్చే దిశగా నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.
వరంగల్- ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రచారం జోరందుకున్నది. మొదటినుంచీ బీఆర్ఎస్కు కంచుకోటగా ఈ ఉన్న సెగ్మెంట్లో మరోసారి విజయం లక్ష్యంగా గులాబీ పార్టీ వ్యూహాలు అమలుచేస్తున్నది. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇతర జిల్లాల బీఆర్ఎస్ నేతలను సమన్వయకర్తలుగా నియమించింది. ప్రచార ప్రక్రియను ముమ్మరం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ ప్రచారం కోసం బుధవారం వరంగల్, హనుమకొండ జిల్లాలకు వస్తున్నారు. నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ల సమావేశాల్లో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, కొత్త రాష్ట్రంలో బీఆర్ఎస్ పాత్రను వివరిస్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను, ముఖ్యంగా నిరుద్యోగులను మోసం చేసిన పద్ధతిని అందరికీ తెలియజెప్పనున్నారు.
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఉదయం 11గంటలకు నర్సంపేట నియోజకవర్గంలో, మధ్యాహ్నం 2గంటలకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో, సాయంత్రం 4 గంటలకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో పాల్గొంటారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ గెలుస్తున్నది. 2007లో జరిగిన మొదటి ఎన్నికలో ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీప్‌కుమార్ ఎన్నికయ్యారు. 2009లో జరిగిన ఉప ఎన్నికలోనూ కపిలవాయి దిలీప్‌కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. 2015, 2021 జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. రాకేశ్‌రెడ్డి గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.