ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకుపోతోంది. అసెంబ్లీ ఎన్నికలకు నెలల సమయమున్నా అందరి కంటే ముందుగానే సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా నేతల్లో ఉత్సాహం నెలకొంది. అభ్యర్థిత్వం ఖరారైన మరుసటి రోజునుంచే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గెలుపు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇలా ఓ వైపు బీఆర్ఎస్ అభ్యర్థులు నియోజకవర్గ ప్రజలతో మమేకమై ప్రచారంలో జోరు పెంచగా, ప్రత్యర్థి పార్టీల్లో మాత్రం అయోమయ పరిస్థితి ఉంది. వర్గపోరు, కుమ్ములాటలతో కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొనగా, కనీసం అభ్యర్థులు కూడా దొరక్క బీజేపీలో నిస్తేజం ఆవరించింది.
– వరంగల్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి దూసుకుపోతున్నది. ఎన్నికల గడువుకు నాలుగు నెలల ముందే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 11 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికల పోరులో బీఆర్ఎస్ ముందంజలో ఉన్నది. బీఆర్ఎస్ అభ్యర్థులు అప్పుడే పూర్తి స్థాయి ప్రచారంలో నిమగ్నమయ్యారు. బీఆర్ఎస్ కార్యక్రమాలు, గ్రామాల వారీ పర్యటనలతో పాటు అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు. ఇప్పటికే మొదలై కొనసాగుతున్న పనులను త్వరగా పూర్తి చేయించేలా చర్యలు చేపట్టారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ముందున్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పేలా చేస్తున్నారు. 2018లో డిసెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అదే తరహాలో చూస్తే ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం ఉన్నది. గతంలో ఎప్పుడూ లేని విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా ముందుగా పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. తొమ్మిది స్థానాల్లో సిట్టింగులకే మరోసారి అవకాశం ఇచ్చారు. పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, తూర్పు, భూపాలపల్లి, వర్ధన్నపేట, పరకాల, నర్సంపే ట, మహబూబాబాద్, డోర్నకల్ స్థానాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలే అభ్యర్థులుగా ఉన్నారు. వీరంతా పూర్తి స్థాయిలో ప్రచారం మొదలుపెట్టారు. స్టేషన్ ఘన్పూర్లో సీనియర్ నేత కడియం శ్రీహరిని అభ్యర్థిగా బీఆర్ఎస్ నిర్ణయించింది. కడియం శ్రీహరి భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ములుగు సెగ్మెంట్లో ఆదివాసీ మహిళ బడే నాగజ్యోతిని అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. నాగజ్యోతి పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్తున్నారు. జనగామ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థిపై త్వరలోనే ప్రకటన రానున్నది. అభ్యర్థులు ఖరారైన 11 స్థానాల్లో బీఆర్ఎస్ ప్రచారం మొదలైంది.
ఎన్నికల గెలుపు వ్యూహంలో బీఆర్ఎస్ దూసుకుపోతుండగా కాంగ్రెస్ పార్టీ అయోమయంలో ఉన్నది. దరఖాస్తు ప్రక్రియ పేరుతో అభ్యర్థులను తేల్చుకోవడానికి హస్తం పార్టీ ఆగమవుతున్నది. ఉమ్మడి జిల్లాలోని 12 సెగ్మెంట్లకు సరైన అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొన్నది. సగానికిపైగా స్థానాల్లో అనామకులే కాంగ్రెస్ అభ్యర్థులుగా ఉంటారని ఆ పార్టీ వర్గాలే వాపోతున్నాయి. చాలా స్థానాల్లో అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు సైతం రాలేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. గత ఎన్నికల్లో రెండుమూడు స్థానాల్లో కాంగ్రెస్కు అభ్యర్థులు లేని పరిస్థితి ఉండేది. ఇప్పుడూ సగానికిపైగా స్థానాల్లో ఇదే తీరుగా ఉన్నది. నాలుగైదు స్థానా ల్లో ఒకరి కంటే ఎక్కువ మంది కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఆయా సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ వర్గాలుగా చీలిపోయింది. వరంగల్ పశ్చిమ, జనగామ సెగ్మెంట్లలో రెండు వర్గాల మధ్య కొట్లాటలే జరుగుతున్నాయి. అభ్యర్థుల ఖరారు వరకు మరో నాలుగు సెగ్మెంట్లలో ఇదే పరిస్థితి ఉండనున్నది.
బీజేపీ పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో దయనీయంగా ఉన్నది. కేంద్రంలో తొమ్మిదేండ్లుగా అధికారం లో ఉన్న బీజేపీకి కనీసం అభ్యర్థులు దొరకని పరిస్థితి ఎదురవుతున్నది. బీజేపీ టికెట్ కోసం అడిగే నాయకులు ఎవరూ ఉండడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సగానికిపైగా స్థానాల్లో బీజేపీ టికెట్ కోసం ప్రయత్నించే ఓ మోస్తరు నేత సైతం లేరు. మొత్తం 12 అసెం బ్లీ సెగ్మెంట్లలో 2018 ఎన్నికల్లో మహబూబాబాద్ స్థానంలోనే ఓ మోస్తరు ఓట్లు వచ్చాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సెగ్మెంట్లోనూ చెప్పుకోదగిన ఓట్లు బీజేపీకి వచ్చే పరిస్థితి లేదు. ఒకటీరెండు సెగ్మెంట్లలో తప్ప ఎక్కడా బీజేపీకి అభ్యర్థులే ఉండరని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు. బీజేపీలో ఉన్న ఒకరిద్దరు మాజీ ఎ మ్మెల్యేలు సైతం ఎన్నికల సమయం వరకు ఇతర పార్టీల్లోకి మారే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటి నుంచే వా రు అవకాశాల కోసం ఇతర పార్టీల ముఖ్యులతో చర్చ లు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీకి ఎప్పటిలాగే దయనీయ ఫలితాలే వచ్చే పరిస్థితి ఉన్నది.