నమస్తే తెలంగాణ నెట్వర్క్ : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఉమ్మడి వరంగ ల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా జరిగాయి. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని ఊరూరా, వాడవాడలా పార్టీ శ్రేణులు గులాబీ జెండాలను ఆవిష్కరించి, సంబురాలు జరుపుకున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో, దేవరుప్పుల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో, పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురంలో పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.

బీఆర్ఎస్ వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకకల్లో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని జెండా ఎగురవేసి మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ మాజీ చైర్పర్సన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి గులాబీ జెండాను ఎగురవేశారు. అనంతరం గండ్ర దంపతులు భారీ కేక్ కట్‌చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని, కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని, ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిషరించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
జనగామ, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ)/దేవరుప్పుల/పాలకుర్తి : పాతికేళ్లు పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న బీఆర్ఎస్కు ఉజ్వల చరిత్ర ఉందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 2001 ఏప్రిల్ 27న పురుడు పోసుకొని, అధినేత కేసీఆర్ దార్శనికత, 14 ఏళ్ల పోరాటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యిందన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంతో పాటు దేవరుప్పుల, పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురంలో సోమవారం నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.
2014లో 66 సీట్లు సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ 24 గంటల కరెంటు, కోటి ఎకరాలకు సాగునీరు, రైతు బీమా, రైతులకు రుణమాఫీ చేసి దేశంలోనే తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమ పార్టీగా ఏర్పడిన బీఆర్ఎస్ తెలంగాణలో నేడు బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి ప్రజల మనసులను చూరగొన్నదన్నారు. తెలంగాణ అవసరాలు, వనరులపై పట్టున్న కేసీఆర్ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల హృదయాల్లో నిలిచారన్నారు. ముఖ్యంగా సాగునీరు, తాగునీరు, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు విధానాన్ని దేశంలోని ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేసిన చరిత్ర ఉందన్నారు.
మిషన్ భగీరథను కేంద్రం కాపీ కొట్టిందన్నారు. పదేళ్లు తెలంగాణను అభివృద్ధిలో ముందువరుసలో నిలిపారని అన్నారు. రేవంత్‌రెడ్డి మోసపూరిత హామీలతో ప్రజలను బురిడీ కొట్టించి గద్దెనెక్కారని అన్నారు. గడిచిన రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన సమస్యలపై పోరాడుతూనే ఉంటామన్నారు. తిరిగి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆరే ముఖ్యమంత్రి అని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు పల్లా సుందర్‌రాంరెడ్డి, దామోదర్‌రెడ్డి, గద్దల నర్సింగరావు, బాల్దె సిద్దిలింగం, రాజశేఖర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, ఉల్లెంగుల సందీప్ తదితరులు పాల్గొన్నారు.