చెరువు పూడికతీత పనుల్లో తీవ్ర జాప్యం
జూన్ 15 నాటికి పనులు పూర్తి చేస్తామన్న మంత్రుల మాటలు నీటి మూటలు
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్
చెరువు కూడిక తీత పనుల పరిశీలన
Dasyam Vinay Bhasker | వరంగల్ : చారిత్రక భద్రకాళి చెరువు పూడికతీత పనుల్లో అధికార పార్టీ నేతల కమిషన్ల కొట్లాటలతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ ఆరోపించారు. శనివారం ఆయన భద్రకాళి చెరువు పూడికతీత పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 15వ తేదీ నాటికి భద్రకాళి చెరువు పూడికతీత పనులను పూర్తి చేస్తామన్న మంత్రుల హామీలు నీటి మూటలుగా మారాయని అన్నారు. ఈ ఏడాది వర్షాకాలం వచ్చేసిన నేపథ్యంలో ఇప్పటివరకు పూడికతీత పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వ్యక్తికి పూడికతీత పనులు అప్పగించి వాటాలు పంచుకున్నారని ఆయన విమర్శించారు. చెరువు సుందరీకరణ పేరుతో కుదించారని అన్నారు.
గతంలో నగర ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించిన భద్రకాళి చెరువును సుందరీకరించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. భద్రకాళి చెరువుపై ఆధారపడి సుమారు 200 మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయని అన్నారు. పూడికతీత పేరుతో చెరువులోనే నీటిని బయటికి వదిలి ఇప్పటివరకు నీటిని నింపకపోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే భద్రకాళి చెరువు పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్లు మరుపల్లి రవి, బోయినపల్లి రంజిత్ రావు, టిఆర్ఎస్ నాయకులు పులి రజనీకాంత్, మోడం ప్రవీణ్, బాబురావు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.