హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 31 : కాంగ్రెస్ హయాంలోనే అంతులేని అవినీతి జరిగిందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాసర్ అన్నారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ మంత్రుల బృందం దేవాదుల ప్రాజెక్టుపై ఎలాంటి అధ్యయనం చేయకుండా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో దండగైన వ్యవసాయాన్ని కేసీఆర్ తన హయాంలో పండుగలా మార్చారని అన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో నూ, ఇతర అంశాల్లోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని అప్పటి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2003లో ఎన్నికల నేపథ్యంలో హుటాహుటిన తాపీ మేస్త్రీ తదితరులను ఒకే హెలికాప్టర్లో తీసుకొచ్చి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దేవాదుల ప్రాజెక్ట్‌కు పునాది వేయించాడని, అప్పటి నుంచి 2014 వరకు ఎలాంటి పనులు జరగలేదన్నారు. 2008లో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 4 వేల కోట్లుంటే, కాంగ్రెస్ హయాంలో దానిని రూ. 10వేల కోట్లకు పెంచి అవినీతికి పాల్పడ్డారని అన్నా రు.
అప్పుడు టీడీపీ, మొన్న బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న కడియం శ్రీహరి ప్రాజెక్ట్‌లపై అవగాహన ఉండికూడా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ అపర భగీరథుడని, 1.20 కోట్ల ఎకరాలకు సాగునీరందించిన ఘనత ఆయనకే దకుతుందని కడియంశ్రీహరి ప్రశంసించారన్నారు. 100 టీఎంసీల నీటిని దేవాదులకు కేటాయించడం హర్షనీయమని,ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని కడియం శ్రీహరి మాట్లాడిన వీడియోను వినయ్‌భాస్కర్ చూపించారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్త మాటలే చెప్తున్నారని, ఆయన పకన ఉండి కూడా కడియం శ్రీహరి మాట కూడా మాట్లాడలేదన్నారు. శ్రీహరి పార్టీలు మారొచ్చు కానీ మాట మార్చవద్దని హితవు పలికారు. రైతును రాజు చేయాలనే లక్ష్యం తో ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, అన్నదాతల కోసం అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్‌కే దకుతుందన్నారు. ఆరు గ్యారెంటీలు, అలవికాని 420 హామీలిచ్చి గద్దెనెకిన కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో అసహనం పెరిగిందని, వారి ఎమ్మెల్యేలను ఎకడికక్కడే నిలదీస్తున్నారని అన్నారు. అందుకే ఫోన్ టాంపరింగ్, మేడిగడ్డ, దేవాదుల అంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. సకాలంలో రుణమాఫీ చేయక, రైతు భరోసా ఇవ్వక, ఎరువులు, విత్తనాలు అందించని దద్దమ్మ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అప్పుడు మంత్రిగా పనిచేసి వందల కోట్లు దోచుకున్నాడని, రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లయిస్‌లో కొన్ని వందల కోట్ల కుంభకోణం చేశాడని, ఆయనకు జైలు తప్పదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే సివిల్ సప్లయిస్‌లో కుంభకోణానికి తెరతీశారని, ప్రతినెలా రూ. 1100 కోట్లు ఎవరెవరి ఖాతాలో, ఏబ్యాంకులో జమవుతున్నా యో తమకు తెలుసన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో దేవాదుల ప్రాజెక్టును 90 శాతం పూర్తిచేసినప్పటికీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు.
కాంగ్రెస్‌లో ఒకరికొకరికి పడడంలేదని, తిట్టిన వారికి పార్టీ ఏదో న్యాయం చేస్తుందనుకుంటే పొరపాటేనన్నారు. మేడిగడ్డపైన కమిషన్ విచారణ జరుగుతుండగానే దానిపైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రైతుల వద్ద క్వింటాల్ ధాన్యం రూ.2,007కు తీసుకొని, రూ. 2,230 ప్రభుత్వం ఇస్తున్నట్లు చెబుతున్నారని, ఈ డబ్బులు ఎటుపోతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,270 చెరువులు జూలై మొదటివారం వరకు నిండుకుండలా కనిపించేవని, ఇప్పుడు నీళ్లు లేక వెలవెలబోతున్నాయన్నారు. అవకాశం ఉన్నప్పటికీ దేవాదుల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి ఇవ్వలేని దద్దమ్మ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అని అన్నారు.
– పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నర్సంపేట
కాంగ్రెస్‌ది ప్రజా పాలన కాదని, ప్రజలను హింసించే పాలన వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. రైతులకు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోలేక వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారని, కక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ డెకాయిట్ అని, కేసీఆర్‌పై తప్పుడు మాటలు మానుకోవాలన్నారు. తెలంగాణను పాలించే అర్హత కాంగ్రెస్‌కు లేదని, రైతులకు చేసిందేమీ లేదన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్‌గౌడ్, కోఆర్డినేటర్ పులి రజనీకాంత్, బీఆర్ఎస్ హసన్‌పర్తి మండలాధ్యక్షుడు బండి రజినీకుమార్, మైనార్టీసెల్ అధ్యక్షుడు మహ్మద్ నయీముద్దీన్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, శ్రవణ్ కుమార్, విజిలెన్స్ కమిటీ మాజీ సభ్యుడు పోలేపల్లి రామ్మూర్తి, 10వ డివిజన్ అధ్యక్షుడు ఖలీల్, 29వ డివిజన్ అధ్యక్షుడు సదాంత్, రవీందర్రావు, వీరస్వామి, పానుగంటి శ్రీధర్, రఘుసంపతీ పాల్గొన్నారు.
– నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే, వరంగల్ తూర్పు
వ్యవసాయరంగం మీద ఎలాంటి అవగాహన లేకుండా కాంగ్రెస్ మంత్రులు మాట్లాడడం సరికాదని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. అనేక ప్రాజెక్టులను కేసీఆర్ చేపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేయడంతో రైతులు పంజాబ్, హర్యానాతో పోటీ పడి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేశారని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటును ఐక్యరాజ్యసమితి మెచ్చుకుందన్నారు. కడియం శ్రీహరి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతుండడం సిగ్గుచేటన్నారు.
కడియం శ్రీహరి ఏ ఎండకు ఆ గొడుగు పడతాడని, దేవాదుల నిర్మాణం ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో 2003లోనే పిండాలు పెట్టానని గుర్తుచేశారు. 2022లోనే పూర్తయ్యే ప్రాజెక్టును అడ్డుకున్నది కూడా కడియం శ్రీహరేనని, ఈ పనుల విషయమై తాను, పల్లా రాజేశ్వర్‌రెడ్డి కేసీఆర్‌ను కలవగా రూ.134 కోట్లు అదనంగా కేటాయించినట్లు చెప్పారు. దిగజారుడు రాజకీయాలను మానుకోవాలని, బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారుల కష్టంతో గెలిచిన కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. పోయే కాలానికి దగ్గరగా ఉన్నావని, ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయాలని హితవు పలికారు.
– తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే, స్టేషన్‌ఘన్‌పూర్