హనుమకొండ, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ ధీమాగా ఉన్నది. అధికార పార్టీకి దీటుగా ఫలితాలు వస్తాయనే అంచనాతో ఉన్నది. గెలుపు కోసం అమలు చేసిన వ్యూహం ఫలించిందని, ఫలితాలు ఆశించిన మేరకు వస్తాయని భరోసాతో ఉన్నది. ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు ఎన్నికలు పూర్తయ్యాయి. శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు. పార్టీ గుర్తుపై పోటీ చేసే ఎన్నికలు కావడంతో బీఆర్ఎస్ మొదటి నుంచి ప్రత్యేక దృష్టి సారించింది.
మున్సిపాలిటీల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించింది. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహంపై ఎప్పటికప్పుడు వ్యూహాలను రూపొందించింది. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ ప్రచారంతో ఎన్నికల్లో గులాబీ పార్టీకి మంచి ఊపు వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లపాటు మున్సిపాలిటీల్లో చేసిన అభివృద్ధి పనులను.. రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయకపోవడాన్ని ఓటర్లు పరిగణలోకి తీసుకున్నారని బీఆర్ఎస్ భావిస్తున్నది.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఓటర్ల జాబితాలో ఉద్దేశ పూర్వకంగా కొందరి చేర్చడం, తొలగించింది. వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియపైనా పలు చోట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. నామినేషన్ల ప్రక్రియలో బీఆర్ఎస్ అభ్యర్థులను పోలీసులతో బెదిరింపులకు గురి చేశారు. ప్రచారంలోనూ అధికార పార్టీ అన్ని రకాలుగా నిబంధనలు ఉల్లంఘించింది. ప్రచారం ముగిసిన అనంతరం ఓటర్లను ప్రలోభ పెట్టింది. వినని వారిని బెదిరించింది.
ప్రతిపక్ష పార్టీలో కీలకంగా ఉంటున్న వారిపై పోలీసు కేసులు పేరిట వేధింపులకు పాల్పడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆదేశాలతో అధికారులు, పోలీసులు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం చేసుకోకుండా అడ్డంకులు కలిగించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడినా పట్టణాల్లోని ఓటర్లు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చారని గులాబీ పార్టీ ధీమాతో ఉన్నది.