ఆత్మీయ సమ్మేళనాలు, ఇతర పార్టీల వెల్లువలా చేరికలు, నిత్యం నాయకులు, కార్యకర్తలతో సమావేశాలతో పాటు పాటు రోజుకో ప్రాంతంలో కలియదిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకూ అలుపెరగకుండా నియోజకవర్గాన్ని చుట్టి వస్తూ జనానికి దగ్గర అవుతున్నారు. వెళ్లిన ప్రతీ చోటల్లా శ్రేణులు, స్థానిక ప్రజలు మద్దతుగా వస్తూ సాదరంగా స్వాగతిస్తుండడంతో విజయోత్సాహంతో ముందుకుసాగుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచార అస్ర్తాలుగా చేసుకుంటూనే ప్రతిపక్షాల మోసపూరిత హామీల నమ్మి ఓటును వృథా చేసుకోవద్దని కోరుతున్నారు. యువతను, వృద్ధులను ఆప్యాయంగా పలుకరిస్తూ, మరోసారి బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేలుగా గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరులో వివిధ గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలతో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. స్కాముల కాంగ్రెస్ కావాలా..? స్కీముల బీఆర్ఎస్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని వారు సూచించారు. అలాగే తొర్రూరు మండలం కంఠాయపాలెంలో క్రికెట్ టోర్నీని ప్రారంభించి బ్యాటింగ్ చేసి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
ప్రజాసేవే తన లక్ష్యమని ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ములుగు అభ్యర్థి బడే నాగజ్యోతి కోరారు. నియోజకవర్గ ఇన్చార్జి కాకులమర్రి లక్ష్మీనర్సింహారావుతో కలిసి తాడ్వాయి మండలం మేడారంలో వన దేవతలు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకొని మేడారం సహా ఊరట్టం, కొత్తూరు, బయ్యక్కపేట గ్రామాల్లో ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
నర్మెట మండలంలో పలు తండాల్లో మానుకోట ఎంపీ మాలోత్ కవిత, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలతో కలిసి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రచారం చేశారు. అర్రాస్ పెట్టేది కాంగ్రెస్ పార్టీ అని.. అభివృద్ధి చేసేది బీఆర్ఎస్ అని విపక్షల మాటలు నమ్మకుండా బీఆర్ఎస్కు ఓటేయాలని పల్లా అభ్యర్థించారు.
నగరంలోని 13, 21, 22, 23 డివిజన్లలో వరంగల్ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్ విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పోచమ్మమైదాన్ నుంచి దేశాయిపేట గార్డెన్ వరకు బీఆర్ఎస్ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. నేను పక్కా లోకల్ అని డెవలప్మెంట్ అనగానే బీఆర్ఎస్, కేసీఆర్, నన్నపునేని గుర్తు రావాలంటూ కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు.
ధర్మసాగర్ మండలం నర్సింగరావుపల్లె, ఎలుకుర్తి, శాయిపేట, జఫర్‌గఢ్ మండలం సాగరం, తిడుగు గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులతో స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థి కడియం శ్రీహరి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఆయాచోట్ల శ్రేణులు, ప్రజలు డప్పుచప్పుళ్లు, పూలవర్షంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
కేసముద్రం మండలం కాట్రపల్లి, అర్పనపల్లి, ఉప్పరపల్లి, వెంకటగిరి, ఇంటికన్నె గ్రామాల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రైతుబంధును వద్దన్న, గిరిజనుల పట్ల హేళనగా మాట్లాడిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని.. పోడు రైతులకు పట్టాలిచ్చి సంక్షేమ పథకాలు అందిస్తున్న బీఆర్ఎస్ను ఆదరించాలని కోరారు.
డోర్నకల్‌లో, కురవి మండలం అయ్యగారిపల్లిలో కురవి, సీరోలు మండలాల ముఖ్య కార్యకర్తలతో డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి డీఎస్ రెడ్యానాయక్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎన్నికలు రాగానే గంగిరెద్దుల్లా కాంగ్రెస్ నాయకులు వస్తారని వారి మాటలు నమ్మి మోసపోవద్దని.. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటేయాలని ప్రజలను కోరారు.
నగరంలోని 54వ డివిజన్లో వరంగల్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ ఇంటింటా ప్రచారం చేశారు. అలాగే హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నియోజకవర్గంలోని దివ్యాంగ పింఛన్ లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డితో కలిసి దాస్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు స్వయంగా ఆయనే భోజనం వడ్డించారు.
రేగొండ మండలంలోని పొనగల్లు, మడుత్తపల్లి, కొడవటంచ, గూడెపల్లి, లింగాల, రేపాక గ్రామాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి విస్తృత ప్రచారం చేశారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
ఉద్యమ కారులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. చెన్నారావుపేట మండలంలోని ఉద్యమకారులు ఎమ్మెల్యేను కలిసి సంపూర్ణ మద్దతు తెలిపారు. అలాగే ఖానాపురం మండలం బుధరావుపేటలోనూ పెద్ది ప్రచారం చేశారు.
పర్వతగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోలింగ్ బూత్ స్థాయి ఇన్చార్జిలు, గ్రామాల బీఆర్ఎస్ నాయకులతో వర్ధన్నపేట అభ్యర్థి అరూరి రమేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.