నర్సంపేట/నల్లబెల్లి, అక్టోబర్ 16 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్, బీజేపీలు దోబూచులాడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. రాజ్యాంగ బద్ధంగా అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి దాన్ని అమలు చేసేందుకు రేవంత్ సర్కారు అశాస్త్రీయమైన ఆర్డినెన్స్‌లు, బిల్లులు, జీవోలు తీసుకురావడంతో అవి కోర్టుల్లో నిలబడలేకపోతున్నాయని అన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీలను తమ రాజకీయ అవసరాల వినియోగించుకుంటూ తీరని అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. ఆ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో చట్టం చేసి 9వ షెడ్యూల్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 18న బీసీ సంఘాలు చేపడుతున్న బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని, పార్టీ శ్రేణులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.