పరకాల, ఫిబ్రవరి 16 : నిబంధనలకు లోబడి విధులు నిర్వర్తించాల్సిన అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘటన హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలో జరిగింది. మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం పరకాల పట్టణం మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఆర్డీవో నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అధికారులు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కాగా ఆర్డీవో కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం 12.30 గంటలకు చైర్మన్ ఎన్నిక చేపట్టి 15 నిమిషాల్లో పూర్తి చేశారు. తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టాల్సి ఉండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లలో నెలకొన్న గందరగోళంతో సమావేశం నుంచి బయటకు వెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కూడా కాంగ్రెస్ కౌన్సిలర్లు హాల్లోకి రాకపోవడంతో కోరం లేదని అధికారులు వైస్ చైర్మన్ ఎన్నికను మంగళవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఐదుగురు, బీజేపీ కౌన్సిలర్లు ముగ్గురు సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు. కాగా, మధ్యాహ్నం 1:51నిమిషాలకు వైస్ చైర్మన్ ఎన్నిక ఉంది. మున్సిపాలిటీ కార్యాలయానికి రావాలని సమాచారాన్ని మెసేజ్ రూపంలో పంపించిన అధికారులు.. వారు రాకుండానే వైస్ చైర్మన్ ఎన్నికను పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు మున్సిపాలిటీకి చేరుకోగా, పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ లోపలికి పంపించకపోవడంతో ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.