అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కారు జోరుమీదున్నది. ప్రత్యర్థి పార్టీలు ఓ వైపు అభ్యర్థులు దొరకక, సీట్ల్ల సర్దుబాటు చేయలేక ఆగమవుతుండగా బీఆర్ఎస్ మాత్రం ఉత్సాహంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే అధినేత కేసీఆర్ సహా మంత్రులు కేటీఆర్, హరీశ్ వంటి ముఖ్యనేతలు ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాలను చుట్టేయడంతో ఊపుమీదున్న గులాబీ అభ్యర్థులు ప్రజా ఆశీర్వాదం కోసం ప్రతి ఇంటి తలుపు తడుతున్నారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించడంతో పాటు మ్యానిఫెస్టోతో ప్రజల వద్దకు వెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తూ జనంతో మమేకమవుతున్నారు. ఇలా ఎక్కడికక్కడ ప్రచార ర్యాలీలు, ఆత్మీయ సమ్మేళనాలు, ఏకగ్రీవ తీర్మానాలు, చేరికలతో పాటు మ్యానిఫెస్టోకు సబ్బండ వర్గాల ఆదరణ లభిస్తుండడంతో ఊరూరా ‘గులాబీ జోష్’ కనిపిస్తున్నది. అలాగే శుక్రవారం వర్ధన్నపేట, మహబూబాబాద్ సెగ్మెంట్లలో ప్రజా ఆశీర్వాద సభలకు తర్వాత మిగతా చోట్లకూ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ రానుండడంతో శ్రేణుల్లో మరింత ఊపు రానున్నది.
వరంగల్, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రచారంలో భారత రాష్ట్ర సమితి ముందువరుసలో ఉన్నది. ప్రత్యర్థి పార్టీలతో పోల్చితే గులాబీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యనేతల పర్యటనలతో ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ మరో కీలక నేత హరీశ్‌రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దాదాపు అన్ని సెగ్మెంట్లను చుట్టి వచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రచారానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 16న జనగామ నియోజకవర్గ ఆశీర్వాదసభలో పాల్గొన్నారు. దసరా పర్వదినం ముగియడంతో తాజాగా రాష్ట్రవ్యాప్త ప్రచారంలో భాగంగా మరోసారి ఉమ్మడి జిల్లాకు రాబోతున్నారు. ఈ నెల 27న ఒకేరోజు వర్ధన్నపేట, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ఈమేరకు ఆయాచోట్ల నిర్వహించే బహిరంగ సభల కోసం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌తో పాటు ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, బానోత్ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీగా జనసమీకరణ చేసి సభలను విజయవంతం చేసేందుకు కృషిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ త్వరలో మిగితా నియోజకవర్గాల్లోనూ ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధమవుతున్నది.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర నమూనాతో బీఆర్ఎస్ ఎన్నికలకు సిద్ధమైంది. ప్రత్యర్థి పార్టీల కంటే చాలా ముందుగా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. టిక్కెట్లు ఖరారైన రోజు నుంచే బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. అన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులు ఇప్పటికే ఒక దశ ప్రచారం పూర్తి చేశారు. నియోజకవర్గ స్థాయిలో సన్నాహక సమావేశాలు, ఆ తర్వాత మండల స్థాయి సమావేశాలు పూర్తయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఊర్ల వారీగా.. నగరాల్లో డివిజన్ల వారీగా, పట్టణాల్లో వార్డుల వారీగా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం పూర్తి చేశారు. కొన్ని సెగ్మెంట్లలో గ్రామాల్లో ఇంటింటికీ ప్రచారం సైతం పూర్తవుతున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటం, సొంత రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి ప్రధాన ఎజెండగా బీఆర్ఎస్ ప్రచారం సాగుతున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లుగా చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఈ నెల 15న ప్రకటించిన మ్యానిఫెస్టో ఎన్నికల ప్రచారంలో కీలకమవుతున్నది. అన్ని వర్గాలు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ఆదరిస్తుండగా ముఖ్యంగా మహిళలు పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నారు. అర్హులైన మహిళలకు ప్రతి నెల రూ.3 వేల చొప్పున భృతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పేద మహిళలకు రూ.400కు గ్యాస్ సిలిండర్ సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నది. అలాగే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇస్తామని ప్రకటించడంపై పేద వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెల్లకార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా అమలు చేస్తామని ప్రకటించింది. బీమాకు అవసరమైన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనున్నది. ప్రతి పేద కుటుంబానికి బీమా కల్పించే ఆలోచన గొప్పదని ఈ వర్గాల వారు చెబుతున్నారు. ఉచిత వైద్య ప్రక్రియలో భాగంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం కోసం అందించే మొత్తాన్ని ఇప్పుడున్న రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచనున్నట్లు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆసరా పెన్షన్ల మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న రూ.2016 నుంచి మొదటి ఏడాదిలో రూ.3016కు… ఆ తర్వాత ఏటా రూ.500 చొప్పున మొత్తంగా రూ.5వేలకు, దివ్యాంగుల పెన్షను ఇదే పద్ధతిలో రూ.6016 వరకు పెంచనున్నట్లు మేనిఫెస్టోలో ప్రకటించడాన్ని సబ్బండ వర్గాలు స్వాగతిస్తున్నాయి. రైతుబంధు పథకం కింద ప్రస్తుతం ఉన్న ఎకరానికి రూ.10 వేలను.. మొదటి ఏడాది రూ.12 వేలకు, ఆ తర్వాత క్రమంగా రూ.15 వేలకు పెంచనున్నట్లు మ్యానిఫెస్టోలో బీఆర్ఎస్ ప్రకటించింది. వడ్ల కొనుగోలు ప్రక్రియను యథావిధిగా కొనసాగించనున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. ప్రస్తుతం అమలవుతున్న హౌసింగ్ విధానాన్ని కొనసాగించనున్నట్లు బీఆర్ఎస్ పేర్కొన్నది. అగ్రవర్ణాల్లోని పేద పిల్లల చదువుల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకులాన్ని ప్రారంభించనున్నట్లు మ్యానిఫెస్టోలో ప్రకటించారు. అనాథ పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక విధానాన్ని అమలు చేయనున్నట్లు బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఉద్యోగుల సీపీఎస్‌పై అధ్యయన కమిటీని నియమించనున్నట్లు ప్రకటించింది. అసైన్ ల్యాండ్ హక్కులపై ప్రత్యేక విధానాన్ని అమలు చేయనున్నట్ల హామీ ఇచ్చింది. మైనార్టీల సంక్షేమాన్ని మరింత విస్తృతం చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు బీఆర్ఎస్ పేర్కొన్నది. అన్ని వర్గాల సమగ్ర అభ్యున్నతి లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టోతో గులాబీ పార్టీ ప్రచారం జోరుగా సాగుతున్నది.
ఉమ్మడి జిల్లాలో బుధవారం బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగింది. పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, తొర్రూరు, రాయపర్తి మండల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విస్తృతంగా పర్యటించారు. ఆయాచోట్ల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ‘బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయమే’ లక్ష్యంగా పనిచేయాలంటూ దిశానిర్దేశం చేశారు. బయ్యారంలో మహబూబాబాద్ జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందుతో కలిసి ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియానాయక్ ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీలో పాల్గొని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. కొత్తగూడ మండలకేంద్రంలో లంబాడీల ఆత్మీయ సమ్మేళనంలో ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చొరవతోనే తాను సర్పంచ్ నుంచి ఇవాళ ఎమ్మెల్యేగా పోటీచేసే స్థాయికి వచ్చానని.. మీ ఆడబిడ్డగా ఆశీర్వదించాలని కోరారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని 20, 22వ వార్డులో ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. మరిపెడలో స్థానిక యువకులతో డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి డీఎస్ రెడ్యానాయక్ సమావేశమై మరోమారు తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తిచేశారు. ఐనవోలు మండలం కక్కిరాలపల్లిలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ పర్యటించగా ఆయన గెలుపులో భాగం అవుతామంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 100మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరగా పెద్ది గెలుపు కోసం యువత ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. వరంగల్‌లో తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ సమక్షంలో 32,34,36 డివిజన్ల కాంగ్రెస్ నాయకులు, నేతలు బీఆర్ఎస్లో చేరారు.