పదో తరగతి పరీక్షల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని సంబంధిత విద్యాశాఖాధికారులు విద్యార్థులకు ఆరు గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత ఎటువంటి అల్పాహారం ఇవ్వకపోవడంతో వారు ఖాళీ కడుపులతో చదువుతున్నారు. దీంతో తమ పిల్లలు నీరసించి పాఠాలు అర్థంకాక సతమతమవుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. గతేడాది బీఆర్ఎస్ సర్కారులో స్నాక్స్ అందించగా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేయడంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. వెంటనే అల్పాహారం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
– భూపాలపల్లి రూరల్, జనవరి 5
పదో తరగతిలో మంచి మారులు సాధిస్తే విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు పడతాయనే ఉద్దేశంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖాధికారులు సరారు బడుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఇంటికి వెళ్లే సరికి సాయంత్రం 6 గంటలు అవుతున్నది. పా ఠశాలలో మధ్యాహ్న భోజనం మినహా ఇతర ఆహారం ఏమీ అందడం లేదు. దీంతో వారు అర్ధాకలితో అలమటిస్తూ చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు అందించే స్నాక్స్‌కు బ్రేక్ పడింది.
జిల్లాలోని 121 ఉన్నత పాఠశాలల్లో మొత్తం 3449 మంది పదో తరగతి విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 1725 మంది బాలురు, 1724 మంది బాలికలు ఉన్నా రు. వీరికి స్పెషల్ క్లాసులు ప్రారంభమైనప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం పౌష్టికాహారంతో కూడిన స్నాక్స్ అందించింది. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున ప్రొటీన్లతో కూడిన శనగలు, బొబ్బర్లు, అనుములు, పల్లీలు, బెల్లం ముద్దలు, ఉడికంచిన కోడిగుడ్లు, అరటిపండ్లు, పకోడి వంటి వాటిని అందజేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో స్నాక్స్ పథకం అటకెక్కింది. దీని ప్రభావం ఫలితాలపై పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవున్నాయి. మార్చి 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నందున వెంటనే ప్రభుత్వం స్నాక్స్ పథకాన్ని కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
నవంబర్ 1 నుంచి జిల్లాలోని పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. గతేడాది కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు స్నాక్స్ అందించాం. జిల్లాలో మొత్తం 3449 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులకు అల్పాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి దేశాలు రాలేదు. దాతలు, ఎన్జీవోలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి స్నాక్స్ అందించాలి.
– ఎం రాజేందర్, డీఈవో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
పదో తరగతి విద్యార్థులకు ఇప్పటికే ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో వారికి అల్పాహారం అందించాల్సి ఉంది. కానీ అందడం లేదు. దాతలు, ప్రభుత్వం ముందుకు వచ్చి అందిస్తే ఏకాగ్రతతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఈసారి 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి సారించాం. గతేడాది కలెక్టర్ ఆదేశాలతో పదో తరగతి విద్యార్థులకు రూ.16 వేలు ఖర్చు చేసి స్నాక్స్ అందించాం. ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ బిల్లులు కూడా ఇవ్వలేదు.
– ఎన్ లక్ష్మీప్రసన్న, హెచ్ఎం, భూపాలపల్లి ఉన్నత పాఠశాల
పొద్దున్నే బడికి వస్తున్నం. వచ్చాక మధ్యాహ్న భోజనం చేస్తున్నం. ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల వరకు మళ్లీ స్టడీ అవర్స్ ఉంటుంది. అప్పుడు ఆకలైతాంది. పాఠాలు అర్థంకాక సతమతమవుతున్నం. ఈ సమయంలో మాకు స్నాక్స్ ఇస్తే ఆకలి తీరుతుంది. ప్రభుత్వం అల్పాహారం అందించేలా చర్యలు తీసుకోవాలి.
-దాసరి గౌతం, పదో తరగతి విద్యార్థి, భూపాలపల్లి