గిర్మాజీపేట, జూన్ 26 : పుస్తక ప్రియులు, ముఖ్యంగా ఉద్యోగార్థులకు విజ్ఞానం అందిస్తున్న గ్రంథాలయాలను నిధులు, సిబ్బంది కొరత వేధిస్తున్నది. చాలాచోట్ల అద్దె భవనాల్లో కొనసాగడం, పక్కా భవనాలు లేకపో వడంతో పాటు సరైన సదుపాయాలు, పోటీ పరీక్షలకు అనుగుణంగా అవసరమైన పుస్తకాలు లేకపోవడం, తదితర సమస్యల కారణంగా పుస్తక పఠనం కోసం వచ్చే నిరుద్యోగ యువత అనే క ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. కొన్నిచోట్ల లైబ్రేరియన్లు కూడా లేకపోవడంతో అటెండర్లతో నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేగాక నేటి పోటీతత్వానికి అనుగుణంగా ఈ-లైబ్రరీ లుగా ఆధునీకరించాల్సిన అవసరమున్నది.
నిధులు, సిబ్బంది కొరతతో విజ్ఞాన నిలయాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రంథాలయాల్లో సదుపాయాలు కల్పించి సమస్యలను పరిష్కరించేందుకు అరకొర నిధులే కేటాయిస్తుండడంతో పాఠకులకు కష్టాలు తప్పడం లేదు. వరంగల్ జిల్లాలో 12 శాఖా గ్రంథాలయాలున్నాయి. గురిజాల, రంగశాయిపేట, ఉర్సు, కరీమాబాద్తో సహా నాలుగు విలేజ్ గ్రంథాలయాలు ఉన్నాయి. కొన్ని లైబ్రరీల్లో సరైన సదుపాయాలు లేక పుస్తక పఠనం కోసం వచ్చే నిరుద్యోగ యువతకు ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని చోట్ల పక్కా భవనాలు ఉన్నా పలుచోట్ల ప్రహరీలు లేవు. బాత్రూమ్స్, మరుగుదొడ్లు లేక అత్యవసర సమయంలో అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో ఏడు గ్రంథాలయాలకు సొంత భవనాలు ఉండగా మూడు లైబ్రరీలకు ఆయా గ్రామ పంచాయతీలు భవనాలు కేటాయించారు. మూడు లైబ్రరీలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. రాయపర్తి, వర్ధన్నపేట ల్రైబరీల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి.
జిల్లాలోని 13 గ్రంథాలయాల్లో ముగ్గురు రెగ్యులర్ ఉద్యోగులు, మరో ముగ్గురు ఔట్సోర్సింగ్, ఆరుగురు పార్ట్‌టైం వర్కర్స్, తొమ్మిది మంది స్లీపర్స్ పనిచేస్తుండగా సిబ్బంది కొరతతో ఒక్కొరికి రెండేసి చొప్పున గ్రంథాలయాల బాధ్యతను అప్పగించడంతో నిర్వహణ కష్టతరమవుతోంది. అటెండర్లే గ్రంథాలయాల నిర్వహణ చూడాల్సి వస్తున్నది.
జిల్లాలోని గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు ఏటా వసూలు చేసే ఆస్తి పన్నులో 8శాతం గ్రంథాలయాల సెస్సును చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిధులను జిల్లా గ్రంథాలయ సంస్థ ఖాతాకు జమ చేయాల్సి ఉంది. ఏటా ఈ ప్రక్రియ వంద శాతం జరగకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో సుమారు రూ.కోటి సె స్సు వసూలు కావాల్సి ఉంది. సకాలంలో సెస్సు వసూలు కాకపోవడంతో సమస్యలు తప్పడం లేదు. ముఖ్యంగా వర్ధన్నపేట, జిల్లాలోని పంచాయతీల ద్వారా సెస్సు బకాయిలు రావాల్సి ఉంది.
జిల్లాలో ఈ-గ్రంథాలయ ఏర్పాటు పత్తా లేకుండా పోయింది. మారుతున్న కాలానికి తగ్గట్లుగా వీటిని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తు న్నా వరంగల్ జిల్లా చైర్మన్‌ను ఇప్పటివరకు నియమించలేదు. దీని ని బట్టి గ్రంథాలయ నిర్వహణపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉం దో అర్థమవుతున్నదని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని జిల్లాకు గ్రంథాలయ చైర్మన్‌తో పాటు రెగ్యులర్ లైబ్రేరియన్లు నియమించి లైబ్రరీల సమస్యలు పరిష్కరించి అభివృద్ధిపై దృష్టిసారించాలని పాఠకులు కోరుతున్నారు.