ములుగు ఏజెన్సీని బాంబు భయపెడుతోంది. పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు వరుసగా పేలుతూ అమాయక జనాన్ని బలి తీసుకుంటున్నాయి. ఈ నెల 3న వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలో ఇల్లందుల యేసు మృత్యువాతపడగా, తాజాగా దైవదర్శనం కోసం ఈ నెల 13 గ్రామస్తులతో వెళ్తూ ప్రెషర్ బాంబుపై అడుగేసిన డర్ర సునీత తీవ్రంగా గాయపడి కాలిని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటికే పోలీసులు పలుచోట్ల మందుపాతరలను నిర్వీర్యం చేసినప్పటికీ ఇలా ఎక్కడ మందుపాతర ఉందో, ఏ ప్రదేశంలో కాలు మోపితే ఏం జరుగుతుందో తెలియక అటీ ప్రాంత జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల సరిహద్దుల్లో పోలీస్-మావోయిస్టుల కారణంగా ప్రశాంతత చెదిరి, ఏ క్షణంలో ఏ విధ్వంసం జరుగుతుందోనని భయంతో వణికిపోతున్నారు.
ములుగు జిల్లాలో మందుపాతరలకు అమాయకులు బలవుతున్నారు. మావోయిస్టుల ఏరివేత పేరుతో అడవుల్లో పోలీసు బలగాలను మోహరిస్తుండగా, ప్రెషర్‌బాంబులు, మందుపాతర్లు అమరుస్తుండడంతో ఏజెన్సీ ప్రజలు వణికిపోతున్నారు. ఈ నెల 3న వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు యేసు అనే వ్యక్తి మృతి చెందాడు. ఇది మరువకముందే ఈ నెల 13న చొక్కాలకు చెందిన డర్ర సునీత గ్రామస్తులతో కలిసి అటవీ ప్రాంతంలోని దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తూ ప్రెషర్ బాంబుపై కాలు వేయడంతో అది పేలి తీవ్ర గాయాలపాలైంది. భద్రాచలం దవాఖాన వైద్యులు శుక్రవారం సునీత ఎడమ కాలును తొలగించడంతో అవిటిరాలిగా మిగిలింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో మందుపాతరలు, ప్రెషర్ బాంబులను గుర్తించడంతో ఏజెన్సీలో కలకలం చెలరేగుతున్నది. ప్రస్తుతం మావోయిస్టులకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కంచుకోటగా ఉన్నప్పటికీ గడిచిన ఆరు నెలల్లో 11 ఎన్కౌంటర్లు జరిగి 119 మంది మావోయిస్టులు చనిపోయారు.
ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం(నూగూరు) మండలాలతో పాటు కొత్తగూడెం జిల్లాలోని చర్ల అడవులు ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దులుగా ఉన్నాయి. రెండు రాష్ర్టాల మధ్య రోడ్డు మార్గాన్ని మినహాయిస్తే పోలీసులు మావోయిస్టుల స్థావరాలను చేరాలంటే దట్టమైన అడవుల గుండా వెళ్లాల్సిందే. అయితే పోలీసులు టార్గెట్‌గా ఆయా మార్గాల్లో మావోయిస్టులు మందు పాతరలు, ప్రెషర్ బాంబులు, బూబీట్రాప్‌లను అమర్చారు. వీటిపై అడుగుపడితే భారీ విస్పోటనం చెందుతాయి. పోలీసు బలగాల వెంట బాంబు డిస్పోజబుల్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఉన్నా కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
2003లో వాజేడు మండలం కొప్పుసూరు గ్రామ సమీపంలోని గుండ్లవాగు బ్రిడ్జి వద్ద అమర్చిన మందు పాతర కారణంగా చిట్టెం అచ్చాలు మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. 2018 లో కొంగాల అటవీ ప్రాంతంలో పాడి ఆవు మృతిచెందింది. 2019లో వెంకటాపురం(నూగూరు) మండలం ముకునూరుపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన పేలుడు కారణంగా దివ్యాంగుడైన సోయం పెంటయ్య మృతిచెందాడు. అలాగే ఈ నెల 5న వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెలిమెల గ్రామ సమీపంలో సాధారణ ప్రజలు తిరిగే దారుల వెంట మావోయిస్టులు అమర్చిన మందు పాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఆరు నెలలుగా రెండు రోజులకు ఒక ఘటన జరుగుతుండటంతో ఏజెన్సీ ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. ఇక పోలీసులు, మావోయిస్టులు ఒకరిపై ఒకరు తప్పు లు వేస్తూ లేఖలు, పత్రిక ప్రకటనలు విడుదల చేస్తున్నారు. మావోయిస్టుల చర్యలను నిరసిస్తూ సామా న్య ప్రజలు సైతం రహదారులపైకి వచ్చి భారీ ర్యాలీలు చేపడుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ములుగు జిల్లాలోని అడవుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నది.