ఎల్కతుర్తి, ఏప్రిల్ 9 : అంబరాన్నంటేలా రజతోత్సవ సంబురం జరగనుందని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. 25 ఏళ్ల క్రితం సుదీర్ఘ చర్చల అనంతరం ఏప్రి ల్ 27న గులాబీ జెండా ఊపిరి పోసుకుందన్నారు. అధినేత కేసీఆర్‌తో కలిసి గులాబీ జెండా పట్టుకొని తెలంగాణలోని 10 జిల్లాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నామన్నారు. ఈ క్రమంలో అనేక పోరాటాలు, త్యాగాలు చేశామన్నారు. బుధవారం ఆయన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న రజతోత్సవ మహాసభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ కమిషన్ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ అన్ని రంగాల్లో వంచనకు గురైన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక నాటి సీఎం కేసీఆర్ నూతన ఒరవడితో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారన్నారు. పార్టీని ఆవిష్కరించిన సమయంలో నాటి సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇది మూడు రోజుల పార్టీ అని, కొస ఎల్లదని ఎద్దేవా చేసినట్లు గుర్తుచేశారు. తెలంగాణ వచ్చేది లేదు.. సచ్చేది లేదు.. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే పార్టీ స్థాపించారని, ఈ ప్రాంత సమస్యలకు పరిష్కారం తామే చూపుతామన్న వెటకారపు మాటలను ప్రజలు మరిచిపోలేదని, బీఆర్ఎస్ ప్రస్థానం వారికి చెంపపెట్టులాంటిదన్నారు. అనేక నిర్బంధాల మధ్య పుట్టుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఉధృత ఉద్యమాన్ని నిర్మించి 2014లో తెలంగాణ స్వరాష్ర్టాన్ని సాధించినట్లు పేర్కొన్నారు.
32 రాజకీయ పార్టీలను ఒప్పించి, కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ఇవ్వక తప్పదనే నిర్ణయానికి వచ్చేలా, పార్లమెంట్లో బిల్లు పెట్టేలా చేసిన ఘనత గులాబీ జెండాదన్నారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టి దేశం మొత్తం ఇటువైపు చూసేలా అభివృద్ధి చేశారని కొనియాడారు. కేసీఆర్ పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రికార్డులు సృష్టించామన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ తరుణంలో గొప్ప బహిరంగ సభ ద్వారా ప్రజలకు మంచి సందేశాన్ని కేసీఆర్ ఇవ్వనున్నారని వెల్లడించారు.
ఇందుకోసం వేదికగా ఎల్కతుర్తిని ఎంచుకున్నామన్నారు. స్వచ్ఛందంగా భూములివ్వడమే కాకుండా రైతులే స్వయంగా భూమిని చదును చేస్తుండడాన్ని కొనియాడారు. తెలంగాణ బాగు కోరుకునే పార్టీ బీఆర్ఎస్ అని, రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం భూమి చదును చేస్తున్న మహిళా రైతులతో మాట్లాడిన వినోద్‌కుమార్, భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు.
ఆయన వెంట వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, మండల పార్టీ అధ్యక్షుడు పిట్టల మహేందర్, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్‌గౌడ్, వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, నాయకులు ఎల్తూరి స్వామి, తంగెడ మహేందర్, తంగెడ నగేశ్, గొల్లె మహేందర్, కడారి రాజు, దేవేందర్‌రావు, కొమ్మిడి మహిపాల్‌రెడ్డి, శ్రీకాంత్‌యాదవ్, దుగ్యాని సమ్మయ్య, గొడిశాల వినయ్, చిట్టిగౌడ్, జూపాక జడ్సన్, హింగె భాస్కర్, రాజేశ్వర్‌రావు, కోరె రాజుకుమార్, ఉట్కూరి కార్తీక్, బొంకూరి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
బహిరంగ సభ జరిగే ప్రాంతంతో పాటు జాతీయ రహదారుల పరిస్థితులను వినోద్‌కుమార్ పరిశీలించారు. కరీంనగర్ నుంచి వరంగల్, వరంగల్-సిద్దిపేట హైవేలను పరిశీలించి పలు రిపేర్లను గుర్తించి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా మరమ్మతు చేయాలని కోరారు. అనంతరం పనులు జరుగుతున్న జాతీయ రహదారులపై చేపట్టాల్సిన చర్యలను చర్చించేందుకు ఎన్హెచ్ఏఐ రీజినల్ ఆఫీసర్‌ను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లారు.