రాయపర్తి, ఫిబ్రవరి 9 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే తెలంగాణ ప్రధాని విషం కక్కుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బీజేపీ కుట్రలో భాగంగానే మోదీ రాజ్యసభలో తెలంగాణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బస్టాండ్ సెంటర్లో గులాబీ శ్రేణులు ఆందోళన-రాస్తారోకో నిర్వహించాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ పబ్బం గడుపుకోవాలన్న దుర్బుద్ధితో బీజేపీ టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం, గులాబీ నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా బీజేపీ నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. లేకపోతే తమ పార్టీ శ్రేణులు బీజేపీ నేతలకు తగిన రీతిలో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. అనంతరం పార్టీ నాయకులు బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, గారె నర్సయ్య, పూస మధు, అయిత రాంచందర్, గబ్బెట బాబు, ఎండీ నయీం, కాంచనపల్లి వనజారాణి, రెంటాల గోవర్ధన్‌రెడ్డి, వంగాల నర్సయ్య, ఉల్లెంగుల నర్సయ్య, కుంచారపు హరినాథ్, బాషబోయిన సుధాకర్ యాదవ్, చందు రామ్‌యాదవ్, అశ్రఫ్‌పాషా, సత్తూరి నాగరాజు, గూడెల్లి తిర్మల్ పాల్గొన్నారు.