వరంగల్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): కమలనాథుల తీరు ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు తయారైంది. మా దారి రహదారి అనే రీతిలో ఆధిపత్యం కోసం పోటీపడుతున్నారు. పార్టీ ముఖ్య నేతల వద్ద అనుచరులతో బలప్రదర్శనకు దిగుతున్నారు. శనివారం జరిగిన బీజేపీ సభ సాక్షిగా మరోసారి ఇదే బహిర్గతమైంది. ఫ్లెక్సీలను పెట్టడం నుంచి మొదలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు స్వాగతం పలకడం, పాదయాత్రలో పాల్గొనడం, బహిరంగ సభకు హాజరుకావడం వరకు అడుగడుగునా కొందరు నేతలు తలపడిన తీరు రచ్చరచ్చగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఉదయం ఖిలావరంగల్ మండలం బొల్లికుంటలోని వాగ్దేవి కళాశాల నుంచి ప్రారంభమైంది.
మామునూరు, నాయుడు పెట్రోల్ బంక్, రంగశాయిపేట, ఖిలావరంగల్ క్రాస్‌రోడ్డు, బట్టలబజార్, ఎంజీఎం సెంటర్ మీదుగా సుమారు పద్నాల్గు కిమీ బండి పాదయాత్ర కొనసాగింది. దీనికి బొల్లికుంట నుంచి కొన్ని కిమీ వరకు స్పందన లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలతో పాటు కళాకారులు సంజయ్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. స్థానికులు అంతగా ప్రజా సంగ్రామ యాత్రలో కనపడలేదు. పాదయాత్రలో ఎక్కడ కూడా బండి సంజయ్ ప్రసంగించలేదు. మార్గమధ్యంలో నాయుడు పెట్రోల్ బంక్ వద్ద పార్టీ వరంగల్పశ్చిమ నేత రాకేశ్‌రెడ్డి తన అనుచరులతో బండి సంజయ్‌కు స్వాగతం పలికారు. తన ఫోటోలతో కూడిన ప్లకార్డులతో ఆయన ఇక్కడకు తరలివచ్చారు. అతని అనుచరులు రాకేశ్‌రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేసి పాదయాత్రలో సంజయ్ వెంట ఉన్న పార్టీ నేతలను ఆశ్చర్యపరిచారు. ప్రధానంగా వరంగల్‌తూర్పు నియోజకవర్గం బీజేపీ నేతలు ఆదిపత్యం కోసం ఈ ప్రజా సంగ్రామ యాత్రలో తలపడడం చూసి కాషాయదండు ముక్కున వేలేసుకుంది.
ఫ్లెక్సీల నుంచి మొదలై..
వరంగల్ తూర్పు నియోజకవర్గ కమలదళంలో వర్గ పోరు నడుస్తోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌ను ఈ నియోజకవర్గంలోని ఒక వర్గం వ్యతిరేకిస్తుండగా మరో వర్గం అతనికి మద్దతుగా నిలుస్తుంది. పార్టీ సమావేశాలు జరిగిన సమయంలో ఇది స్పష్టం అవుతుంది. ఈ క్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ సతీష్, పార్టీ నేత గంట రవికుమార్ నేతృత్వంలో ఇక్కడ రెండు వర్గాలు పనిచేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో గతంలో వరంగల్‌తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తాజాగా గత గురువారం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కమలదళంలో చేరారు. దీంతో తూర్పు బీజేపీలో ఇంకో వర్గం ఆవిర్భవించిందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నట్లు సమాచారం. ఇది నిజమనేలా శనివారం ప్రజా సంగ్రామ యాత్రలో ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, గంట రవికుమార్ ఫ్లెక్సీల ఏర్పాటు నుంచి జన సమీకరణ వరకు పోటీపడ్డారు. బండి సంజయ్‌కు స్వాగతం చెపుతూ వీరిరువురు వరంగల్తూర్పులో అనేకచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద, రోడ్ల పొడవునా డివైడర్ల మధ్య ప్రదీప్‌రావు, రవికుమార్‌ల ఫ్లెక్సీలు పోటాపోటీగా వెలిశాయి. ప్రదీప్‌రావు, రవికుమార్ వేరువేరుగా తమ అనుచరులతో కలిసి బండి సంజయ్‌కు స్వాగతం పలుకగా వీరి అనుచరులు బలప్రదర్శనను తలపించేలా తమ నేతకు అనుకూలంగా నినాదాలు చేశారు.
కాషాయదండు విస్మయం
ఆధిపత్యం కోసం ప్రదీప్‌రావు, రవికుమార్‌ల బలప్రదర్శన చూసి తూర్పు కాషాయదండు నివ్వెరపోయింది. పార్టీలో ఇప్పటికే రెండు వర్గాలు ఉండగా కొత్తగా మరో వర్గం తెరపైకి వచ్చిందని చర్చించుకోవడం వినపడింది. ప్రదీప్‌రావు బీజేపీలో చేరడానికి కొద్ది రోజుల ముందు గంట రవికుమార్ వరంగల్‌తూర్పు నియోజకవర్గంలోని సమస్యలపై ప్రదీప్‌రావు ఏనాడు స్పందించలేదని పేర్కొనడం, తరువాత ప్రదీప్‌రావు బీజేపీ గూటికి చేరడం, కొద్ది రోజులకే ఇక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర జరగడం, ఈ యాత్ర సందర్బంగా ప్రదీప్‌రావు, రవికుమార్ పోటీపడటం తూర్పులో రాజకీయంగా చర్చనీయమైంది. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా వరంగల్‌లో ఇసుక అడ్డా వద్ద ప్రదీప్‌రావు బైక్‌పై ర్యాలీగా స్థానిక ఎమ్మెల్యే ఇంటివైపు వెళ్లేందుకు ప్రయత్నించగా అనుమతి లేదని ఏసీపీ గిరికుమార్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రదీప్‌రావు, ఏసీపీకి మధ్య వాగ్వాదం జరిగింది.