వర్ధన్నపేట ఏప్రిల్ 1 : సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు చేదు అనుభవం ఎదురైంది. ఆకేరు వాగు నుండి ఇసుకను తరలించకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఇసుక కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్లు ఇల్లంద గ్రామంలోని జాతీయ రహదారిపై ఎమ్మెల్యే నాగరాజును అడ్డుకున్నారు. తాము ఉపాధి కోల్పోయిన కూడా ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని కూలీలు నిరసన తెలిపారు.
సుమారు రెండు గంటలపాటు జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే అక్కడికి రావడంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆత్మహత్య చేసుకుంటామని కూలీలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడకుండా వెళ్లిపోవడం పట్ల కూలీలు తీవ్ర అసహనానికి గురయ్యారు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చచెప్పి పక్కకు పంపించడానికి నానా ఇబ్బందులు పడ్డారు.
బయటపడ్డ వర్గ పోరు..
కాంగ్రస్‌లో వర్గ పోరు ఒక్కసారిగా బయటపడింది. ఒక వర్గానికి చెందిన కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల స్థానికంగా ఉండే కొంతమంది కాంగ్రెస్ నాయకులు దీనిని తప్పుపట్టారు. ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని పంపించారు. కాగా, పోలీసుల పట్ల కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది.